బిజినెస్ ఏదైనా సరే.. కాస్త క్రియేటివిటీ చూపిస్తేనే ఇప్పుడు జనాల్ని ఆకర్షించగలం. హోటల్ వ్యాపారం అన్నది రుచితో ముడిపడ్డదే అయినా.. ఆ రుచి నోటికి తగలడానికి ముందే అటువైపు వెళ్లాలన్న ఆసక్తి కలగాలి. ఆ ఆసక్తి రేకెత్తించడానికి హోటళ్లు రకరకాల ఎత్తుగడలతో రంగంలోకి దిగుతున్నాయి. మొన్నా మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజైనపుడు ఆ మేనియాకు తగ్గట్లుగా ఆసక్తికర ఐటెమ్స్ సిద్ధం చేసి జనాల్ని ఆకర్షించింది ఓ హోటల్. ఇలా సందర్భానికి తగ్గట్లుగా తమ క్రియేటివిటీ చూపించి.. జనాల దృష్టిని తమవైపు తిప్పుకునే కాన్సెప్ట్ హోటల్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. తాజాగా అమీర్ పేటలోని ‘తాలింపు’ అనే రెస్టారెంట్ ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర కాన్సెప్ట్ తో భోజన ప్రియుల్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ అంటేనే బిరియానీలకు ఫ్యామస్. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పేరుతో స్పెషల్ బిర్యానీల్ని అందిస్తోంది తాలింపు రెస్టారెంట్. దీని గురించి వినూత్నంగా ప్రచారం కూడా చేస్తోంది. క్రికెట్ జట్టులోని సంఖ్యను సూచించేలా బిర్యానీ ప్యాకేజీల్ని ఈ రెస్టారెంట్ అందిస్తుండటం విశేషం.