బిట్‌ కాయిన్ దందాలో కొత్త కోణం

Update: 2017-12-26 05:17 GMT
హైద‌రాబాద్ వ్యాపార స‌త్తాపై మ‌రోమారు కీల‌క అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్రపంచ ట్రేడ్ మార్కెట్లను ఉరకలెత్తిస్తున్న మాయా కరెన్సీ బిట్‌ కాయిన్ ట్రేడింగ్ దేశంలోని పలు ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్‌ లోనూ విస్తరిస్తోంది. పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తుండటంతో అనేకమంది బిట్‌కాయిన్ల కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారు. కనిపించని నగదు అయిన ఈ క్రిప్టో కరెన్సీకి ఉన్న సౌలభ్యాన్ని ఉపయోగించుకుని.. తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా అమాయకులను బురిడీ కొట్టించేవారు సైతం రంగంలోకి దిగి.. ఈ వ్యవహారంపై అవగాహన లేనివారిని మోసంచేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి రోజుల వ్యవధిలో రెట్టింపు లాభాలొస్తాయంటూ మభ్యపెడుతున్నారు. వాస్తవానికి ఈ కరెన్సీకి చట్టబద్ధతలేదు. అదే సమయంలో బిట్‌ కాయిన్ల కొనుగోలు నేరమూ కాకపోవడంతో అక్రమార్జనలకు పాల్పడేవారు దీనిని సావకాశంగా మల్చుకుంటున్నారన్న వాస్తవాలు ఇటీవల దేశవ్యాప్తంగా 60వేలమంది ఇన్వెస్టర్లు - ట్రేడర్లపై ఐటీ సోదాల సందర్భంగా వెల్లడయ్యాయి.

ఆన్‌ లైన్‌ లో వివిధ రకాల బిట్‌కాయిన్ అప్లికేషన్(యాప్)లను డౌన్‌ లోడ్ చేసుకుని, కనిపించని మార్గంలో భారీ ఎత్తున ఇండియన్ కరెన్సీని ఇంటర్‌ నెట్ ద్వారా తరలిస్తున్నారు. ఇది రోజుకు కోట్లలోనే ఉంటున్నదని సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ - హైదరాబాద్ - బెంగళూరు - కొచ్చి - గుర్గావ్ - ముంబై కేంద్రాలుగా బిట్‌ కాయిన్ దందా యథేచ్ఛగా సాగుతున్నదని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌ లోని బేగంబజార్ - ఉస్మాన్‌ గంజ్‌ లోని వ్యాపారులతో పాటు కొందరు బడా రియల్టర్లు బిట్‌ కాయిన్లను భారీ ఎత్తున కొనుగోలు చేశారని సమాచారం. వారిలో చాలామంది బిట్‌ కాయిన్ దందాను రికార్డులలో చూపలేదని ఇటీవలి తనిఖీల్లో వెల్లడైంది. ఇటువంటి వారిపై ఇండియన్ ఇన్‌ కం ట్యాక్స్ యాక్ట్ 133 ఏ కింద కేసులను నమోదుచేశారు. వాస్తవానికి ఇండియాలో పెద్దనోట్ల రద్దు తర్వాత బిట్‌ కాయిన్ వ్యాపారం హైదరాబాద్‌ లో కూడా బాగా పుంజుకున్నట్టు సమాచారం. ఇక్కడ కొందరు వ్యాపారులు సిండికేట్‌ గా ఏర్పడి - బిట్‌ కాయిన్ల ట్రేడింగ్‌ కు స్థానికంగా ఒక ఎక్సేంజ్ నడుపుతున్నట్టు ఐటీ అధికారుల పరిశీలనలో తేలింది. వ్యాపారులంతా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని అక్కడే తమ బిట్‌ కాయిన్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. దీనినే ఎక్సేంజ్ కేంద్రంగా మార్చుకుంటున్నారు. వ్యాపారులంతా గ్రూపులుగా ఏర్పడి - తలా కొంత డబ్బును పోగుచేసి ఈ వేదికల ద్వారా బిట్‌ కాయిన్‌ లలో పెట్టుబడులు పెడుతున్నారు.

బిట్‌ కాయిన్ వ్యాపారం బ్లాక్‌ మార్కెట్‌ కు అడ్డాగా మారింది. బిట్‌ కాయిన్ ఆన్‌ లైన్ ట్రేడింగ్‌ పై కొద్దిమందికే అవగాహన ఉంది. అందులో ట్రేడింగ్ అకౌంట్ ఉండేదీ కొందరికే. ప్రస్తుతం బిట్‌ కాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌ లో భారీగా పలుకుతుండటంతో బ్లాక్‌ మనీ ఉన్నవారు బిట్‌ కాయిన్ అకౌంట్ ఉన్న వారిని ఆశ్రయిస్తున్నారని సమాచారం. అకౌంట్ ఉన్న వారు కొంత కమీషన్ మాట్లాడుకుని ట్రేడింగ్‌ లో వివిధ వ్యక్తుల నుంచి భారీగా డబ్బు సేకరించి బిట్‌ కాయిన్‌ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా ఒక ప్రాంతంలో దాదాపు 15నుంచి 20మంది సిండికేట్‌ గా వ్యాపారం చేస్తున్నారు. ఫలితంగా నల్లధనం ఇంటర్‌ నెట్ మనీ రూపంలో ప్రపంచ మార్కెట్‌ లోకి వెళుతున్నది. లాభం వస్తే ఎప్పుడోకానీ లెక్కలు చూపడం లేదు. నష్టం వస్తే దానిని వ్యాపారులు రికార్డులలో వెల్లడిస్తున్నారు. కొత్త శకానికి తెరతీసిన బిట్‌ కాయిన్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ దేశంలో నల్లకుబేరులకు వరంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే.. నల్లధనం తెల్లధనంగా ఎలా మారుతున్నదనేది అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.

మ‌రోవైపు బిట్‌ కాయిన్ విలువ పెరుగడంతో బ్రోకర్లు రంగప్రవేశం చేశారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు అమాయకులను నమ్మించి టోకరా ఇస్తున్నారు. రూ.1750 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్‌ లైన్‌ లో  లాగిన్ అయిన తర్వాత లక్ష పెట్టుబడి పెడితే 15రోజుల్లో రూ.90వేలు మీ ఖాతాలో జమవుతాయంటూ నమ్మిస్తున్నారు. ఆ తర్వాత ప్రతీవారం వాటి విలువ పెరుగుతుందని - 18 వారాలలోపు పెట్టుబడికి రెట్టింపు వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఒకేసారి ఎనిమిది లక్షలకు పైబడి పెట్టుబడి పెట్టే వారిని మలేసియా - బ్యాంకాక్ - సింగపూర్ దేశాలకు విహారయాత్రలకు తీసుకెళుతామంటూ ఆశచూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఇది నిజమని నమ్మి.. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెడుతున్నారు. దేశంలో పలు మోసాలకు పాల్పడుతున్న కొందరు నైజీరియన్లు కూడా ఈ బిట్‌ కాయిన్ ద్వారా బ్లాక్‌ మనీని ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం.  స్థూలంగా హైద‌రాబాద్ వేదిక‌గా ఈ న‌యా ప్యాపారం కొత్త పుంత‌లు తొక్కుతోంద‌ని ఐటీ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News