అవిశ్వాసం బాబుకు బూమరాంగ్ కానుందా?

Update: 2018-07-18 12:56 GMT
లోక్ సభలో టీడీపీ - కాంగ్రెస్ లు ప్రవేశపెట్టిన అవిశ్వాసాలను చర్చకు స్వీకరించడం వెనుక బీజేపీ భారీ ప్లానుతో ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీని ఎండగట్టి.. ఏపీకి కేంద్రం ఏమేం చేసిందో చెప్పడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని తెలుస్తోంది. దుగరాజ పట్నం పోర్టు - కడప ఉక్కు విషయంలో రాష్ట్రప్రభుత్వం నుంచి అందని సహకారం గురించి.. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు సమర్పించకపోవడం వంటివి సభలో బీజేపీ మరోసారి ఎండగట్టబోతున్నట్లు సమాచారం. అదేసమయంలో విశాఖకు రైల్వే జోన్ ప్రకటించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
    
ఉత్తరాంధ్రలో... ముఖ్యంగా విశాఖలో ఎంపీ స్థానం - ఎమ్మెల్యే స్థానం ఒకటి బీజేపీ ఖాతాలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ బీజేపీ కీలక నేత ఒకరు పోటీ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీతో క్లోజ్ మూమెంట్స్ ఉన్న జనసేన కూడా ఉత్తరాంధ్రపైనే ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ ప్రకటించి బీజేపీ - జనసేన కాంబినేషన్లో అక్కడ కొన్ని సీట్లను కొట్టాలనే కోరిక బీజేపీ బుర్రలో ఉన్నట్లు తెలుస్తోంది.    
    
ఇదే కనుక జరిగితే చంద్రబాబుకు ఇబ్బంది తప్పదు. కేంద్రన్ని - బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నంలో ఆయన కాంగ్రెస్ అండతో అవిశ్వాసాన్ని పెట్టినా దాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటే రాష్ట్రంలో టీడీపీ అభాసుపాలవడం ఖాయం. పైగా... కేంద్రం తామేం ఇచ్చింది పార్లమెంటు సాక్షిగా మరోసారి చెప్పి చంద్రబాబుపై దాడి పెంచితే ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవడం ఆయనకు కష్టమే.
Tags:    

Similar News