ప్రభుత్వంపై ఏపీ బీజేపీ విమర్శలు !

Update: 2019-08-09 11:30 GMT
అవినీతి రహిత పాలన విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.  జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదని మండిపడ్డారు. అవినీతిని నిర్మలిస్తామని పదేపదే చెప్పడం తప్ప ఆ దిశగా తీసుకున్న చర్యలేంటని ఆయన  ప్రశ్నించారు. విజయనగరం పర్యటనలో ఉన్న కన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పై విమర్శలు చేస్తూ వైఎస్ పై ప్రశంసలు కురిపించారు.  

‘‘అవినీతి నిర్మూలన విషయంలో మాటలు గట్టిగా చెబుతున్నారు. కానీ చర్యలు మాత్రం లేవు. పోలవరం టెండర్ల రద్దు, బందరు పోర్టు టెండర్ల రద్దు, ఇలా వరుసగా టెండర్లను రద్దు చేసుకుంటూ పోతే నష్టమే తప్ప లాభం లేదు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక విధానంపై ఉద్దేశపూర్వక కాలయాపన జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటుపై స్పష్టత లేదు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం. పోరాటం చేస్తాం. రాజన్న పాలనను మళ్లీ తెస్తామని చెప్పుకున్న జగన్ కు అంత సీన్ లేదు. క్షేత్ర స్థాయిలో దీనికి విరుద్ధంగా ఉంది’’ అని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

ఈ సందర్శంగా కన్నా దివంగత రాజశేఖరరెడ్డి పాలనను ప్రశంసించారు. వైఎస్ పేదలకు పట్టెడు అన్నం పెడితే , జగన్ మాత్రం పేదల పొట్ట కొడుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 

Tags:    

Similar News