ఆ లేడీ సీఎం జుట్టుప‌ట్టి లాక్కెళ్తార‌ట‌

Update: 2016-12-12 10:38 GMT
బీజేపీ అగ్ర నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మ‌రోమారు ఆ పార్టీని ఇర‌కాటంలో ప‌డేశాయి. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. నోట్ల ర‌ద్దుపై మ‌మ‌తా చేస్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై తీవ్రంగా మండిప‌డిన సంద‌ర్భంలో ఆయ‌న వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ ద‌గ్గ‌ర మ‌మ‌తా నిర‌స‌న చేప‌ట్టడాన్ని ప్ర‌స్తావిస్తూ... 'అక్క‌డ మా ప్ర‌భుత్వ‌మే ఉంది. మేం త‌ల‌చుకుంటే ఆమెను జ‌ట్టు ప‌ట్టుకొని అక్క‌డి నుంచి ఈడ్చుకెళ్లేవాళ్లం కాదా?' అంటూ ఘోష్ వ్యాఖ్యానించారు.

అయితే ప‌శ్చిమ‌బెంగాల్ బీజేపీ అధ్య‌క్షుడు చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై తృణ‌మూల్ కాంగ్రెస్ మండిప‌డింది. అస‌భ్య‌క‌రంగా, గూండాలు ఉప‌యోగించే ప‌దాల‌తో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు మాట్లాడారంటూ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తృణ‌మూల్ కాంగ్రెస్  పార్టీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పార్థా చ‌ట‌ర్జీ మీడియాతో మాట్లాడుతూ..."దిలీప్ ఘోష్ వ్యాఖ్య‌ల‌ను మేం తేలిగ్గా తీసుకోబోం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మ‌మ‌తా త‌న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతూనే ఉంటారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకొనే వ‌ర‌కు ఆమెను ఎవ‌రూ అడ్డుకోలేరు" అని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. "దిలీప్ ఘోష్ వ్యాఖ్య‌లు చూస్తే.. ఆయ‌న మాన‌సిక స్థితి ఏంటో తెలుస్తోంది. మా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను చంపుతాన‌ని కూడా బెదిరించారు. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న వార్త‌ల్లో నిల‌వాల‌ని అనుకుంటున్నారు. ఇలాంటి అస‌భ్యక‌ర భాష‌తో బెంగాల్ సంస్కృతిని దెబ్బ‌తీయ‌డాన్ని మానుకోవాలి"అని పార్థా అన్నారు. నోట్ల ర‌ద్దుపై రానున్న మూడు రోజులు నిర‌స‌న‌లు చేపట్ట‌నున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News