ఏంటో... తెలుగు బీజేపీ : బండి వీర దూకుడు...సోము నీరసం

Update: 2023-04-07 16:32 GMT
ఏంటో ఉత్తరాది పార్టీగా బీజేపీకి ముద్ర పోయేట్లు లేదు. సౌత్ ఎంట్రీ అంటూ దశాబ్దాలుగా ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా విఫలం అవుతున్నాయి. అదే టైం లో అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రం కూడా ఈసారి హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇక చూస్తూంటే రెండు తెలుగు రాష్ట్రాల మీదనే బీజేపీ ఫోకస్ ఉంది అంటున్నారు.

రెండు చోటో స్పీడ్ పెంచి గేర్ మార్చి ముందుకు పోవాలని బీజేపీ చూస్తూంటే ఇద్దరు సారధులూ కూడా బీజేపీకి తీరని  అసంతృప్తినే మిగులుస్తున్నారు అంటున్నారు. ముందుగా తెలంగాణాలో గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ విషయమే తీసుకుంటే అక్కడ కరీంనగర్ ఎంపీగా గెలిచి అనూహ్యంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు వచ్చి బీజేపీ ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ వీర దూకుడు ఇపుడు బీజేపీకే ఇబ్బందిగా మారిందట.

బండి సంజయ్ పదవి పోతుంది అన్న సంకేతాలు రావడంతో ఆయన మరింతగా జోరు చేశారు. దాంతో ఇపుడు బీజేపీతో పాటు తాను కూడా ఇరకాటంలో పడిపోయారు అంటున్నారు. తెలంగాణాలో పదవతరగరి పరీక్షా ఫలితాల్లో లీకుల పర్వం అంటూ కేసీయార్ సర్కార్ ని టార్గెట్ చేస్తే భారీ పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఆయన పెర్ఫెక్ట్ ప్లానింగ్ వేశారు.

అయితే అది కాస్తా బూమరాంగ్ అయింది, కట్ చేస్తే రెండు రోజుల పాటు సంజయ్ అరెస్ట్ అయి జైలులో ఉండాల్సి వచ్చింది. నిజానికి పరీక్షా పత్రాల లీకేజ్ లో సంజయ్ కి సంబంధం లేదు. కానీ ప్రశాంత్ అనే ఒక లీకేజి వీరుడుతో  ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ మాట్లాడడం ద్వారానే తాను దొరికారు. చివరికి బీజేపీని కూడా డిఫెన్స్ లో పడేశారు.

పదవతరగతి విద్యార్ధుల తల్లితండ్రులు అంతా ఈ లీకేజీల మీద మండిపోతున్నారు. అక్కడ వారి బిడ్డల భవిష్యత్తు ఉంది. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ చూడడం వరకూ ఓకే. కానీ లీకేజ్ బయటపడినపుడు. కానీ లీకేజ్ చేసిన వారితోనే టచ్ లో ఉంటే ఎలాంటి రాంగ్ మెసేజ్ ని అది అందిస్తుంది అన్న దాన్ని బండి ఇక్కడ విస్మరించారు అంటున్నారు.

తన అధ్యక్ష పదవి పోతుందన్న ఆందోళనలో ఏదో ఒకటి చేసి మరీ బీజేపీకి కేసీయార్ సర్కార్ మీద ఆదిపత్యం పెంచాలని మైలేజ్ తీసుకురావాలని ఆయన పడిన హడావుడితోనే కొత్త చిక్కుల్లో బీజేపీ పడింది అని అంటున్నారు. లేటెస్ట్ పరిణామాలతో బీజేపీ మీద సంజయ్ మీద పదవతరగతి విద్యార్ధుల తల్లితండ్రులు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంటే తెలంగాణాలో బీజేపీకి ఉన్న ఆదరణ కాస్తా ఇపుడు రివర్స్ అయ్యేలా బండి వీర లెవెల్ దూకుడు ఉందని అంటున్నారు. ఇది నిజంగా బీజేపీ పెద్దలను ఆలోచింపచేస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా బండి సంజయ్ అతి దూకుడే ఆయన్ని జైలులో పెట్టించింది అని అంటున్నారు. దీంతో బీజేపీ పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు.

గెలుస్తామని తొడ కొడుతున్న చోట, పార్టీకి ఎంతో కొంత ఆశావహ పరిస్థితులు ఉన్న చోట బండి సంజయ్ ఈ విధంగా  దూ కుడు చేయడం నిజంగా కమలం పార్టీకి నష్టమే అని అంటున్నారు. ఇక ఏపీ విషయం చూస్తే సోము వీర్రాజు మూడేళ్ల క్రితం పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తే ఈ రోజుకు రెండు చట్ట సభలలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఆయన సారధ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదు.

అంతే కాదు లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం బీజేపీ కనీసమాత్రంగా కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఈ నేపధ్యంలో సోము వీర్రాజుని తప్పిస్తారు అని వార్తలు వస్తున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోవడంలేదు అంటున్నారు. ఆయన సారధ్యం అంతా నిర్లిప్తంగా  నీరసంగా సాగుతోందని అంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఒకరు అతి దూకుడుతో బీజేపీకి చేటు తెస్తూంటే మరొకరు అతి నెమ్మదితనంతో పార్టీని పాతాళానికి లాగుతున్నారని అంటున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో కమలం వికసించే పరిస్థితి ఉంటుందా అన్నదే ఇపుడు చర్చనీయాంశంగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News