బీజేపీ బైట్ : గోదావ‌రి గ‌ర్జ‌న ఏం చెప్ప‌నుంది ?

Update: 2022-06-07 07:30 GMT
ఏపీలో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగి అయినా పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న తలంపులో బీజేపీ హై కమాండ్ ఉంది. ఏపీలోనే కాదు టీజీలో కూడా ! అయితే ఇక్క‌డ సోము వీర్రాజు లాంటి లీడ‌ర్లను కంట్రోల్ చేస్తే బీజేపీ పై ఇప్ప‌టిదాకా ఉండే అప‌వాదులు తొల‌గిపోతాయి. అదేవిధంగా అవాకులూ,చ‌వాకులూ కూడా త‌గ్గిపోతాయి. ప‌వ‌న్ తో ఉన్న విభేదం కార‌ణంగానే సోము వీర్రాజు వైసీపీకి చేరువుగా ఉంటున్నార‌న్న విమ‌ర్శ కూడా జేపీ న‌డ్డా వ‌ర‌కూ వెళ్తే,రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్ర‌క్షాళ‌న‌కు కొన్ని అవకాశాలు ఉంటే ఉండ‌వ‌చ్చు.

లేదు సోము వీర్రాజునే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకుని ముందుకు వెళ్తే, రానున్న కాలంలో పొత్తుల మాట ఎలా ఉన్నా బీజేపీ సంస్థాగ‌తంగా కూడా పెద్ద‌గా బ‌లోపేతం కాకుండా ఉండిపోవ‌చ్చు అన్న వాద‌న కూడా వినిపిస్తోంది విశ్లేష‌కుల నుంచి ! బూత్ లెవ‌ల్ లో పార్టీని బ‌లోపేతం చేస్తేనే మ‌నుగ‌డ సాధ్యం అని న‌డ్డా లాంటి వ్య‌క్తులు చెబుతున్నారు. మ‌రి ! వాటిని పార్టీ కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర ముఖ్య నేత‌లూ ప‌ట్టించుకుని ముందుకు వెళ్తే.. ఎన్నిక‌ల్లో విజ‌యం అటుంచితే ముందుగా బీజేపీ క్షేత్ర స్థాయిలో స్థిర సంఖ్య‌లో బ‌లం పెంచుకోవ‌డం ఖాయం అని ప‌రిశీల‌కులు అంటున్నారు.
 
ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు సంబంధించి ఇవాళ ఓ బ‌హిరంగ స‌భ‌ను నిర్వహించ‌డం, తద్వారా ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణంకు సంబంధించి కొన్ని సూచ‌న‌లు ఇవ్వ‌డం వంటివి ఇవాళ బీజేపీ చేయ‌నున్న ప‌నులు. బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా స‌భ‌లో ఆయ‌నేం చెప్ప‌నున్నారు అన్న‌దే అత్యంత ఆస‌క్తిదాయకంగా ఉంది.

ఎప్ప‌టి నుంచో ఏపీ డిమాండ్లు అయిన ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక రైల్వే జోన్ ఏర్పాటు వీటితో పాటు విభ‌జ‌న  చ‌ట్టం అమ‌లు. వీటిపైనే మాట్లాడ‌తారని అనుకోవాలా ? లేకా వీటి నుంచి త‌ప్పించుకుని కేవ‌లం విప‌క్ష పార్టీల‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసి, రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కించి వెళ్లిపోతార‌ని అనుకోవాలా ! ఒక ప్ర‌శ్న..ఒక ఆశ్చ‌ర్య మ‌ధ్య‌నే ఇప్పుడంతా రాజ‌కీయం అంతా గూగుల్ వాకిట ఊగిస‌లాడుతోంది.

ఎందుకంటే బీజేపీకి  ఎప్ప‌టి నుంచో తెలుగు రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించాల‌ని ఉంది. ఆవిధంగా ఆంధ్రా ప్రాంతం పై ప‌ట్టు సాధించాల‌ని ఉంది. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల‌పై కొంత ప‌ట్టు ఉంది కూడా ! ఆ ప‌ట్టును నిల‌బెట్టుకోలేక ఆ ఓటు బ్యాంకు ను కూడా కోల్పోయిన దాఖ‌లాలు అనేకం ఉన్నాయి. ఇక్క‌డున్న కిసాన్ మోర్చా బాగానే ప‌నిచేస్తోంది. రైతుల‌కు పీఎం కిసాన్ యోజ‌న వంటి ప‌థ‌కాలు ఏవిధంగా మేలు చేస్తున్నాయి వంటివి వివ‌రిస్తూనే ఉంది.

కానీ అవేవీ స‌రిపోవు. జ‌న‌సేన మాదిరిగా బీజేపీ క్షేత్ర స్థాయిలో రోడ్డుపైకి వ‌చ్చి ఉద్య‌మాలు చేసిన దాఖ‌లాలు త‌క్కువ. ఇంకా చెప్పాలంటే బీజేపీ  నిర్వ‌హించేది కేవ‌లం మీడియా స‌మావేశాలు మాత్ర‌మే! అందుకే బీజేపీ క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం కాలేక‌పోతోంది. ఉన్న కొద్ది మంది లీడ‌ర్లు కూడా ఎవ‌రికి వారే అన్న తీరున స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ జేపీ న‌డ్డా ఇప్ప‌టికే పొత్తుల సంగ‌తి అటుంచి పార్టీ బ‌లోపేతానికి త‌గు ప్రాధాన్యం ఇచ్చి కృషి చేయాల‌ని స్టేట్మెంట్ ఇచ్చారు. స్వ‌యం కృషితో రాష్ట్రంలో నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఎద‌గాల‌ని కూడా పిలుపు నిచ్చారు.ప్ర‌త్య‌ర్థుల మైండ్ గేమ్ గురించి ఆలోచించ‌వ‌ద్ద‌ని కోర్ క‌మిటీ భేటీలో రాష్ట్ర కార్య‌వ‌ర్గానికి దిశానిర్దేశం చేశారు.
Tags:    

Similar News