మోడీ కామెంట్ల క‌థేంటి? హుజూరాబాద్ గెలుపుతో బీజేపీ అధికారంలోకా?

Update: 2021-11-08 15:30 GMT
`నాకు నువ్వు-నీకు నేను` అన్న‌ట్టుగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఎవ‌రిది గెలుపు? అనే చ‌ర్చ వ‌స్తే..చెప్ప‌డం క‌ష్టం. పార్టీల‌కు అతీతంగా.. ఏర్పాటు చేసుకున్న ఓటు బ్యాంకే మాజీ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను గెలిపించింద‌నేది కొంద‌రి వాద‌న‌. అలాకాదు.. బీజేపీ గుర్తుపై గెలిచారు క‌నుక బీజేపీహ‌వానే అంటారా? అనేవారు కూడా క‌నిపిస్తున్నారు. ఇక‌, ఇదే విష‌యాన్ని ప‌ట్టుకుని.. తాజాగా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్ గెలుపే నాందీప్ర‌స్తావ‌న‌గా.. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని.. ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. నిజానికి హుజూరాబాద్‌లో బీజేపీ బ‌లం ఎంత‌? ఆమాటకొస్తే.. తెలంగాణ‌లో బీజేపీ సామ‌ర్థ్యం ఎంత అనే లెక్క‌లు తీయాల్సి వ‌స్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో దుబ్బాక‌, హుజూరాబాద్‌ల‌ను బీజేపీ కైవ‌సం చేసుకుంది. సాగ‌ర్‌లో అట్ట‌ర ఫ్లాప్ అయింది. దుబ్బాక‌లో మాట‌ల ఫైర్ బ్రాండ్ ర‌ఘునంద‌న‌రావు ఇమేజ్ ప‌నిచేసింద‌ని.. అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, హుజూరాబాద్‌లో రెండున్న‌ర ద‌శాబ్దాలకు పైగా వేసుకున్న ఈటల పునాదులు క‌లిసి వ‌చ్చాయ‌ని అంటున్నారు. మ‌రి బీజేపీ సామ‌ర్థ్యం ఎక్క‌డ ఉంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఒక‌వేళ బీజేపీ జెండానే రెప‌రెప‌లాడుతుంటే.. సాగ‌ర్‌లో గెలుపు ఎందుకు దూర‌మై.. నోటాకు ఎందుకు చేరువ కావాల్సి వ‌చ్చిందో ప్ర‌ధాన మంత్రి వంటి కీల‌క స్థానంలో ఉన్న‌వారు ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. మేడిపండు మాట‌ల తియ్యంద‌నాన్ని నాయ‌కులు స్వాగ‌తించినా.. ప్ర‌జ‌లు హ‌ర్షించలేర‌నే విష‌యాన్ని బీజేపీ నేత‌లు గ్ర‌హించ‌లేకపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి హుజూరాబాద్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు శూన్యం. గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. నోటా కంటే కూడా త‌క్కువ ఓట్లు వ‌చ్చిన సంద‌ర్భం ఉంది. పోనీ.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి కేడ‌ర్ ఉందా? అంటే.. అది కూడా లేదు.

ఇక‌, నాయ‌క‌గ‌ణాన్ని తీసుకున్నా.. హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ వంటి చోట్ల ఉన్న‌వా రంతా.. వ‌ల‌స నేత‌లే కావ‌డం.. గ‌మ‌నార్హం. ఆయారాం.. గ‌యారాం.. అనే నాయ‌కుల‌తో బీజేపీ సాగిస్తున్న‌.. యాత్ర‌.. అధికార తీరాన్ని ఎప్పుడు చేరుతుందో ఆ నాయ‌కులే బోధ‌ప‌డ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎవరైనా ఒక్క‌రైనా.. పార్టీ జెండా ప‌ట్టుకుని గెలిచిన వారు క‌నిపిస్తున్నారా? ఎవ‌రికివారు.. సొంత ఇమేజ్‌తో కుస్తీప‌డి.. పార్టీని బ‌తికిస్తున్న‌వారే. ఇది మంచిదే కావొచ్చు.

కానీ.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో పుంజుకునే వ్యూహాలు ర‌చించ‌కుండా.. ఎన్నాళ్లు ఈ స్త్రోత్ర పాఠాలు.. మెచ్చుకోలు మాట‌లు? అనేది ప్ర‌శ్న‌. మ‌రి ఇప్ప‌టికైనా.. వాస్త‌వంలోకి వ‌చ్చి.. తెలంగాణకువిభ‌జ‌న హామీలు అమ‌లు చేస్తే.. నేత‌లు త‌లెత్తుకుని.. జెండాను ఠీవీగా ఎగ‌ర‌నిచ్చే ప‌రిస్థితి ఉంటుంది. ఇది వ‌దిలేసి.. వాపును చూసి.. గెలుపుకోసం ప‌రుగులు పెట్ట‌డం ఏమంతం స‌మంజ‌సం కాద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News