వెల్‌కం ప‌వ‌న్‌...బీజేపీలో పార్టీ విలీనం చేయ్‌

Update: 2019-12-04 16:43 GMT
``ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే బీజేపీ పార్టీతో విభేదించాను త‌ప్ప‌...బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను. దేశ ప్రయోజనాలు, ప్రజల కోసం బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాను కానీ ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నానను``అంటూ రాజ‌కీయ క‌ల‌క‌లం రేపే కామెంట్లు, బీజేపీతో వైఖ‌రి విష‌యంలో ప్ర‌శంస‌లు కురిపించిన జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో...భార‌తీయ జ‌న‌తాపార్టీ ఖుష్ అవుతోంది.  పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్వాగతించారు. పవన్ త‌న పార్టీని విలీనం చేస్తాన‌నే ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామన్నారు. అంతేకాదు, అదుకు తన వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.


రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, బీజేపీతో తాను కలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని.. ఈ విషయంలో వైసీపీ నేతలు తనకు దండం పెట్టాలని వ్యాఖ్యానించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని.. తన ఇంటి దగ్గరలో జరుగుతున్న మత మార్పిడులు జగన్‌కు కనపడడం లేదా..? అని పవన్ మ‌త‌ప‌ర‌మైన ట‌చ్ కూడా ఇచ్చారు. ఈ సంద‌ర్భంగానే బీజ‌పీని ఆయ‌న ప్ర‌శంసించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌ప్ప తాను బీజేపీతో దూరం లేన‌ని... దేశ ప్రయోజనాలు, ప్రజల కోసం బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని పవ‌న్ చెప్పుకొచ్చారు. `2014లో మాదిరి బీజేపీ, టీడీపీలతో కలసి పోటీ చేద్దాం అని ప్రధాని, చంద్రబాబుల దగ్గరకు వెళ్లి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు మాట్లాడే వాళ్లంతా ఎక్కడ ఉండే వారు. ప్రత్యేక హోదా అంశం మీద ప్రజల కోరిక మేరకు ప్రధానితో విబేధించాల్సి వచ్చింది. టీడీపీతో కలసి ఉంటే విడివిడిగా బరిలోకి దిగాల్సిన అవసరం ఏంటి?` అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో...బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు రియ‌క్ట‌య్యారు. తమ విధానాలు నచ్చి బీజేపీ తో కలిసి పనిచేయాలనుకుంటే.. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని తెలిపారు. పొత్తులకు ఇది సమయం కాదని, ఎన్నికల ముందే జనసేనని బీజేపీలో విలీనం చేయాలని కోరామని, అప్పుడు పవన్ అంగీకరించలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.  రాజకీయ కారణాలతో తమ భుజాలపై నుంచి 6 అడుగుల బుల్లెట్‌ను...వేరేవారిపైకి సంధించాలనుకుంటే పొరపాటేనని ప‌రోక్షంగా ప్ర‌తిప‌క్షాల రాజ‌కీయాన్ని జీవీఎల్ ప్ర‌స్తావించారు.
Tags:    

Similar News