తుగ్ల‌క్ చేసిన ప‌నే మోడీ చేశాడు

Update: 2017-11-16 08:30 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ భారీ సంస్క‌ర‌ణ‌గా ప్ర‌క‌టించుకున్న‌ప్ప‌టికీ...ఆయ‌న్ను తీవ్రంగా డిఫెన్స్‌లో ప‌డేలా చేసిన పెద్ద నోట్ల ర‌ద్దు చేసి ఏడాది దాటిపోయిన‌ప్ప‌టికీ...ఆ నిర్ణ‌యం తాలుకూ విమర్శ‌ల‌ను, సెటైర్ల‌ను ఇంకా మోడీజీ భ‌రించాల్సి వ‌స్తోంది. అధికార ప‌క్షం గ‌త బ్లాక్‌డే పేరుతో నిర‌స‌న చేప‌ట్టాగా తాజాగా..సొంత పార్టీకే చెందిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా మ‌ళ్లీ పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా ప్రధాని నరేంద్ర మోడీపై మళ్లీ మాటల దాడి చేశారు. 14వ శతాబ్దానికి చెందిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 700 ఏళ్ల క్రితమే నోట్లను రద్దు చేశాడని గుర్తుచేస్తూ, మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

అహ్మ‌దాబాద్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట ఏర్పాటైన కార్యక్రమంలో నోట్లరద్దు, వస్తు సేవా పన్ను (జిఎస్టీ)పైన  సిన్హా తన మనోభావాలను వెల్లడించారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 3.75 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగిందన్నారు. ‘గతంలో ఎంతోమంది రాజులు సొంతంగా కరెన్సీని ప్రవేశపెట్టారు.. కొంతమంది పాత కరెన్సీని యథాతథంగా ఉంచుతూ కొత్త కరెన్సీని తెచ్చారు.. అయితే- 700 ఏళ్ల క్రితం తుగ్లక్ మాత్రం సొంత నాణాలను తెచ్చి పాతవాటిని రద్దు చేశాడు.. ఈ కారణంగా నోట్లరద్దు అనుభవం ఈ దేశంలో 700 ఏళ్లకు ముందే ఉంది.. రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చడంలో అపఖ్యాతి పాలైన తుగ్లక్ కరెన్సీని రద్దు చేయడంలోనూ పేరు సంపాదించాడు..’ అని సిన్హా వివరించారు.  ఈ దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్య అని, ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు ఏదో ఒకటి చేయాల్సిన తరుణం ఇదేనని అన్నారు. నోట్లరద్దు అనంతరం కొత్తనోట్ల ముద్రణకు 1,28,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నోట్లరద్దు వల్ల ప్రత్యక్షంగా 3.75 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగిందన్నారు.

గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు ఆర్థికమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా నోట్లరద్దు, జిఎస్టీలను ‘మీడియా వేడుకలు’గా అభివర్ణించారు. ఏది చేసినా మీడియాలో ప్రచారం కోసం చేసే రోజులొచ్చాయని, మనం చేసిన దాన్ని గతంలో ఎవరూ చేయలేదన్న భావన కూడా ఇప్పటి నేతల్లో అధికమైందన్నారు. ‘వాజపేయి హయాంలోనూ ఎన్నో మంచి పనులు జరిగాయి. ఏమీ చేయకుండా ఉంటే ఆయనకు `భార‌తరత్న’ పురస్కారం ఇచ్చేవారా?’ అని ప్రశ్నించారు. కానీ ప‌నులు చేయ‌డం కంటే ఇంత‌ర వాటిపై ఆస‌క్తులు పెరిగిన ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News