పందేరంపై భాజపాలో కూడా కడుపుమంటే!

Update: 2017-11-03 23:30 GMT
నాకేలేదు నాకుడు బెల్లం అంటే... నీకెక్కడినుంచితేవాలి గోకుడు బెల్లం అన్నట్లు తయారైంది పదవుల పందేరం. నామినేటెడ్ పోస్టుల పంపకం చంద్రబాబు కు తలబొప్పి కట్టిస్తోంది. సంస్థాగతంగా పార్టీ పటిష్టత కోసం శ్రమించినవారిని నామినేటెడ్ పోస్టులతో సంతృప్త పరుస్తారు. ఖాళీగా పదవులున్నాయి. ఆశించేవారు ఎక్కువయ్యారు. పదవుల పందేరం పెద్దసమస్యగా తయారైంది. తెదేపాలో ఆశావహులకు పదవులను సర్దడమే చికాకుగా ఉంటే.. మిత్రపక్షం బీజేపీ వారుకూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు అసలు పోస్టుల భర్తీ అంటూ చేపడితే.. తమకు ఏదో ఒక పదవి దక్కకుండా పోతుందా అనుకుంటున్నారు.

దేవాదాయ ధర్మాదాయశాఖ - సహకారశాఖ - మార్కెట్ కమిటీ - స్థానిక సంస్థలు - నగర అభివృద్ధి కమిటీలలో రాజకీయపార్టీ ప్రతినిధులుగా పాలకపక్షం నామినేట్ చేస్తుంది. వీటిల్లో గౌరవప్రదమైన దేవస్థానాలకు పాలక మండలి, లాభదాయక వనరులున్న మార్కెట్ కమిటీ - సహకార సంఘాల్లో పోటీలేకుండా పాలకపక్షం ఇచ్చే పదవులను ఆశించేవారు ఎక్కువయ్యారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిత్వం ఆశించినవారు, స్థానిక సంస్థల్లో పేరున్నవారికి పదవులిచ్చి ఎక్కడికక్కడ పార్టీ ని బలోపేతం చేయడానికి చంద్రబాబు సాహసం చేయలేకపోతున్నారు.

ఈనేపథ్యంలో కొందరు సంస్థాగతంగా పార్టీకి చెందినవారు - పొరుగు పార్టీనుంచి వలసొచ్చినవారు - మిత్రపక్షమైన బీజేపీకి చెందినవారు నామినేటెడ్ పోస్టులను ఆశించి భంగపాటుకు గురయ్యారు. ఈ కోవలోనే దేశంలోనే ప్రతిష్టాత్మక మైన తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి పదవికోసం ఆశించేవారు ఎక్కువయ్యారు. బీజేపీ నుంచి రాయపాటి సాంబశివరావు - తెదేపా తరఫున కడపజిల్లా మైదుకూరు స్థానంలో పోటీచేసి ఓడిన పుట్టా సుధాకర్ యాదవ్ విశ్వప్రయత్నాలు చేశారు. ఆర్థిక మంత్రి యనమల సిఫార్సుతో సుధాకర్ యాదవ్ కు పదవి ఖాయమని ప్రచారం జరిగింది. ఆశావహుల్లోంచి అసంతృప్తి వ్యక్తంకావడంతో పాలకమండలి నియామకం సందిగ్దంలో పడింది.

దేవాదాయ శాఖను చూస్తున్నది భాజపా మంత్రే గనుక.. అసలు బోర్డుల భర్తీ జరిగితే.. ఒక్కోచోట ఒక్కోటి అయినా భాజపా వారికి దక్కుతుంది కదా అనే ఆశ వారిలో ఉంది. అయితే అసలు పనే జరగడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి అలకలు ఆటంకంగా తయారయ్యాయి. అన్నివర్గాలను సంతృప్తపరచే పరిస్థితిలేదు. చంద్రబాబును నామినేటెడ్ పోస్టుల పంపకం ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. ఆయన సమీక్షలు పెడుతున్నారే తప్ప.. ఆల్రెడీ తయారైన జాబితాలపై రివ్యూలు చేస్తున్నారే తప్ప.. అసలు పదవులంటూ ఇవ్వడం లేదని భాజపా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం విశేషం. మరి ఊరిస్తున్నపదవులు ఎవరిని వరిస్తాయో!
Tags:    

Similar News