చంద్రబాబును టార్గెట్ చేసిన కమలనాదులు

Update: 2021-06-02 13:30 GMT
డిజిటల్ మహానాడులో కేంద్రానికి సహకారం అందించాలని చేసిన తీర్మానం నేపధ్యంలో చంద్రబాబునాయుడును బీజేపీ నేతలు చాలా తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. బీజేపీలోని సీనియర్ నేతలందరు తీర్మానంపై భగ్గని మండిపోతున్నారు. 2019 ఎన్నికల సమయంలో నరేంద్రమోడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ కేంద్రానికి మద్దతివ్వాలని తీర్మానం చేస్తారంటు నిలదీస్తున్నారు.

2018లో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన చంద్రబాబు అదేపనిగా మోడికి వ్యతిరేకంగా దేశమంతా పర్యటించిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించాలంటు తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లో విస్తృతంగా పర్యటించారు. పై రాష్ట్రాల్లో జరిగిన బహిరంగసభలు, రోడ్డుషోల్లో  బీజేపీని ఓడించాలని పిలుపివ్వటమే కాకుండా మోడిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు.

బీజేపీని ఓడించాలని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరింత మెజారిటితో నరేంద్రమోడి రెండోసారి ప్రధానమంత్రయ్యారు.  కేంద్రంలో మోడి రెండోసారి ప్రధానమంత్రి అవ్వటమే కాకుండా రాష్ట్రంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అప్పటినుండి మళ్ళీ మోడి ప్రాపకం సంపాదించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మోడి వైపునుండి మాత్రం ఎలాంటి స్పందనా కనబడలేదు.

ఈ నేపధ్యంలోనే కేంద్రానికి అంశాలవారీగా మద్దతంటు మహానాడులో ఏకంగా తీర్మానమే చేయించారు. దానిపైనే కమలనాదులు మండిపోతున్నారు. మోడికి చంద్రబాబు మద్దతు అవసరమే లేదంటున్నారు. మోడికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును తమ పార్టీ మళ్ళీ దగ్గరకు తీసుకునే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోధర్ కూడా టీడీపీతో పొత్తుకు ద్వారాలు మూసుకుపోయాయంటు ప్రకటించారు. టీడీపితో కలవాలని బీజేపీ ఏరోజు అనుకోలేదని కూడా చెప్పారు. మొత్తంమీద భవిష్యత్ సంగతిని పక్కనపెట్టేస్తే ఇప్పటికైతే బీజేపీ నేతలు చంద్రబాబు టార్గెట్ గా అస్త్రాలు సంధిస్తున్నారు.
Tags:    

Similar News