చుక్కలు చూస్తున్న చంద్రుడు

Update: 2018-10-06 01:30 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చుక్కలు కష్టాలు ఎదురయ్యాయా.? కేంద్రంలో భారతీయ జనాత పార్టీ, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారా? గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. చంద్రబాబు నాయుడి పైన - తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గుర్రుగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్. నరసింహా రావును ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజులను ఆయుధంగా కమలానాధులు ప్రయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఐటి శాఖలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయంటూ జీవీఎల్. నరసింహా రావు ఆరోపించారు. దీనిపై కోర్టుకు కూడా వెడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఇన్‌ ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ చూస్తున్నారు. దీంతో కమలనాథులు చంద్రబాబు నాయుడు - ఆయన కుటుంబ సభ్యులపై నేరుగా యుద్దం ప్రకటించినట్లు అయింది. మరోవైపు శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఇళ్లపైన - వ్యాపార సంస్థలపైన ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తోంది. ఇదీ చంద్రబాబుకు చుక్కలు చూపెడుతోంది అంటున్నారు.

 ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రబాబే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. నిజమాబాద్ - నల్గొండ - వనపర్తిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆశీర్వాద సభలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రసంగాలు చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రసంగాలలో చంద్రబాబు నాయుడిని టిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దోషిగా నిలబెడుతున్నారు. తెలంగాణ వెనుకబడి ఉండడానికి ముఖ్య కారకుడు చంద్రబాబే అని తన ప్రసంగాలతో విమర్శలను గుప్పిస్తున్నారు. ఇదీ చంద్రబాబు నాయుడకు చుక్కలు చూపిస్తోంది అంటున్నారు. తెలంగాణకు నీళ్లు - నిధులు భవిష్యత్తు లేకుండా చేసిన చంద్రబాబును తరిమి కొట్టాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు చంద్రబాబు నాయుడి వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతో కె. చంద్రశేఖర రావు మరింత వాడిగా - వేడిగా మాట్లాడుతున్నారు. దీనిపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడి గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కు పూర్తిగా తెలియడం వలనే ఈ విమర్శలు చేస్తున్నారని, వీటికి సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు మర్యాదగా మాట్టాడండి అంటూ అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి అటు కమలనాథులు - ఇటు తెరాస అధిష్టానం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు భూమి మీదే చుక్కలు చూపిస్తున్నారంటున్నారు.

Tags:    

Similar News