'గ్రేట‌ర్' లో పూర్వ వైభ‌వం కోసం బీజేపీ స్కెచ్!

Update: 2018-11-06 03:30 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారా మోగిన నేప‌థ్యంలో అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం టీఆర్ ఎస్ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రోవైపు - మ‌హా కూట‌మి తో గులాబీ కోట‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని కాంగ్రెస్ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేస్తోంది. ఇక‌, జాతీయ స్థాయిలో మ‌రోసారి చ‌క్రం తిప్పాల‌ని భావిస్తోన్న బీజేపీ...తెలంగాణ‌లో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లు సాధించి త‌మ స‌త్తా చాటాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ముఖ్యంగా గ్రేట‌ర్ పై క‌మ‌ల‌నాథులు ఫోక‌స్ పెట్టారు. 5 సిట్టింగ్ స్థానాలైన అంబర్‌ పేట - ముషీరాబాద్‌ - ఉప్పల్‌ - గోషామహల్‌ - ఖైరతాబాద్ ల‌తో పాటు మ‌రిన్ని స్థానాల‌ను కైవ‌సం చేసుకునేందుకు గెలుపు గుర్రాల కోసం వెదుకుతోంది. ఈ క్ర‌మంలోనే అస‌మ్మ‌తి నేత‌ల‌ను బుజ్జ‌గిస్తూ....రాబోయే కాలంలో సముచిత స్థానం కల్పిస్తామని న‌చ్చ‌జెబుతోంది.

గ్రేటర్‌ లోని మొత్తం 15 నియోజకవర్గాల్లోనూ మిగ‌తా పార్టీల‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ  ప్రయత్నిస్తోంది. ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనే స‌త్తాతో పాటు  అంగబ‌లం - అర్ధ‌బ‌లం - ఆర్థిక బ‌లం గ‌ల నేత‌ల‌ను అభ్య‌ర్థుల‌ను ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది. గెలుపే ధ్యేయంగా బ‌రిలోకి దిగుతోన్న బీజేపీ...క‌నీసం రెండో స్థానం అయినా ద‌క్కించునేలా పావులు క‌దుపుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సీనియ‌ర్ల‌ను తోసిరాజ‌ని...వ్యాపారవేత్త యోగానంద్ కు టికెట్‌ ఇచ్చింది. కార్వాన్‌ లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే బద్దం బాల్‌ రెడ్డిని ఈ సారి రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. మజ్లిస్ హ‌వా ఉన్న కార్వాన్ లో గెలిచిన బద్దం... రాజేంద్రనగర్‌ లోనూ విజయం సాధిస్తారనే టికెట్ కేటాయించింది.  మల్కాజిగిరి బ‌రిలో పార్టీ నగర అధ్యక్షుడు - ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావును బరిలోకి దింపింది.
 
ముస్లింల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న పాతబస్తీలో పూర్వ వైభవం సాధించాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. దివంగత నేత నరేంద్ర హ‌ఠాన్మ‌ర‌ణం - బద్దం బాల్ రెడ్డి కార్వాన్ - రాజేంద్ర న‌గ‌ర్ వైపు ఫోక‌స్ చేయ‌డంతో ...బీజేపీ ఓల్డ్ సిటీలో కొద్దిగా ప‌ట్టు కోల్పోయింది. తాజాగా, మలక్‌ పేట నుంచి నరేంద్ర కొడుకు ఆలె జితేంద్రను ఎంపిక చేసింది. చాంద్రాయణగుట్టలో గ‌ట్టి అభ్య‌ర్థి అక్బరుద్దీన్ పై పోటీకి ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషిస్తోన్న సయ్యెద్‌ షహజాదీని ఎంపిక చేసింది. మైనారిటీ వ‌ర్గానికి చెందిన ఆమె...స్థానికులతో పరిచయాలు పెంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో, అక్బ‌రుద్దీన్ కు దీటైన పోటీ ఇవ్వ‌గ‌ల‌ద‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మ‌రి, గ్రేట‌ర్ లో క‌మ‌ల వికాసం ఎంత‌వ‌ర‌కు ఉంటుందో చూడాలంటే మ‌రి కొంత‌కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News