ఎమ్మెల్యే హ‌ఠాన్మ‌ర‌ణం..నేతల క‌న్నీరు మున్నీరు!

Update: 2018-05-04 10:01 GMT
ఆయ‌నో ఎమ్మెల్యే. బీజేపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఊహించ‌నిరీతిలో చోటు చేసుకున్న ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం ఇప్పుడు అంద‌రిని షాక్ కు గురి చేస్తోంది. అంత‌కు మించి.. ఆయ‌న మ‌ర‌ణం పార్టీల‌కు అతీతంగా నేత‌ల కంట క‌న్నీరు పెట్టిస్తోంది. ఎందుకు? ఆయ‌న మీద అంత అభిమానం ఎందుకు? అన్నది చూస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలే బ‌య‌ట‌కు వ‌స్తాయి.

బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలోని జ‌య‌న‌గ‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ విజ‌య్ కుమార్ ఇప్ప‌టికి ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు విజ‌యం సాధించారు. తాజాగా.. క‌ర్ణాట‌క‌లో ప్ర‌తికూల ప‌రిస్థితిని బీజేపీ ఎదుర్కొంటున్నా.. ఆయ‌న గెలుపు మాత్రం ముందే ఖ‌రారైంద‌ని చెబుతారు. ఎందుకిలా అంటే.. ఆయ‌న నిజాయితీ.. మంచిత‌నంగా చెబుతారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టంతో పాటు.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌నుల మీద దృష్టి పెట్ట‌టం.. నీతిగా.. నిజాయితీగా వ్య‌వ‌హ‌రించ‌టం లాంటివి విజ‌య్ కుమార్ ప్ర‌త్యేక‌త‌లుగా చెబుతారు.

ఈ కార‌ణంగానే ఆయ‌న మ‌ర‌ణం ప‌లు పార్టీల నేత‌ల్ని షాక్‌కు గురి చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న లాంటి వ్య‌క్తి మ‌ర‌ణించ‌ట‌మా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌య‌కుమార్ ఇంటికి చేరుకున్న మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యుర‌ప్ప  మాట్లాడుతూ.. నిజాయితీ క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడ‌ని చెప్ప‌టంతో పాటు.. ఈసారి ఎన్నిక‌ల్లో క‌చ్ఛితంగా గెలుస్తార‌ని.. ఆయ‌న గెలుపు ఖ‌రారైంద‌న్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో తాము షాక్ కు గురైన‌ట్లు చెప్పారు. బీజేపీ ఒక ప్ర‌ముఖ నాయ‌కుడ్ని కోల్పోయింద‌న్నారు.

విజ‌య‌కుమార్‌ను క‌డ‌సారి చూసేందుకు పెద్ద ఎత్తున నేత‌లు.. ప్ర‌జ‌లు ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. దీంతో.. బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. పార్టీల‌కు అతీతంగా ప‌లు పార్టీల నేత‌లు విజ‌య‌కుమార్ ఇంటికి  చేరుకొని శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించ‌టం గ‌మ‌నార్హం.

బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో బీజేపీ ఈ ప‌రిస్థితికి రావ‌టానికి కార‌ణం విజ‌య‌కుమార్ గ‌డిచిన పాతికేళ్ల‌లో చేసిన కృషిగా కేంద్ర‌మంత్రులు అనంత్ కుమార్‌.. స‌దానంద‌గౌడ వ్యాఖ్యానించారు. ప‌లువురు బీజేపీ నేత‌లు విజ‌య్ కుమార్ పార్ధిప‌దేహాన్ని చూసి క‌న్నీరు పెట్టుకున్నారు. విజ‌య్ కుమార్ ఆక‌స్మిక మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆయ‌న బ‌రిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ను వాయిదా వేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల సంఘం దీనిపై  అధికారిక ప్ర‌క‌టన జారీ చేయాల్సి ఉంది.
Tags:    

Similar News