చంపుతా లేదంటే చస్తా అంటున్న ఎమ్మెల్యే!

Update: 2015-12-02 17:55 GMT
దేశంలో మత అసహనం మీద భారీఎత్తున చర్చ సాగుతుంటే.. తాజాగా హైదరాబాద్ కు చెందిన గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. ఉస్మానియా వర్సిటీలో ఈ నెల 10 తేదీన బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నాలు చేయటం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని 10వేల మందితో నిర్వహించటంతో పాటు.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా అతిధులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.

మరోవైను.. ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం విద్యార్థి సంఘాల వ్యాఖ్యలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఫ్ ఫెస్టివల్ ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని.. అవసరమైతే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవటం కోసం చంపుతాం.. లేదంటే చస్తాం అంటూ మాటలు తూటాల మాదిరి పేలుస్తూ కొత్త ఉద్రిక్తతల్ని సృష్టిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద సైతం విమర్శలు చేసిన ఆయన.. తాజాగా ఓయూలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునే విషయంలో ఎలాంటి రాజీ పడనని స్పష్టం చేస్తున్నారు. చివరకు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినప్పటికీ వెనక్కి తగ్గనని వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘‘ఈ కార్యక్రమం కోసం ప్రాణాలు ఇవ్వటానికి.. తీసుకోవటానికైనా సిద్ధం’’ అంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఓయూలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు నిర్వహించే ర్యాలీకి పోటీగా తాను కూడా ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెబుతున్నారు. రాజా సింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఫ్ ఫెస్టివల్ ను తాము వ్యతిరేకించటం కానీ.. అనుకూలంగా కానీ ఉండమన్నారు. ఈ కార్యక్రమంలో గో మాంసం వినియోగించరని తెలిసిందని.. దీంతో.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చూస్తుంటే.. రాజా సింగ్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం కానున్నాయన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News