కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Update: 2022-04-05 05:33 GMT
హైదరాబాద్ లోని పబ్ లో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం పెనుదుమారం రేపుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేత రాజాసింగ్ స్పందించారు. సంచలన ఆరోపణలు చేశారు.  అవిప్పుడు వైరల్ అయ్యాయి. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

గతంలో హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ వివాదాన్ని ఇప్పుడు రాజాసింగ్ తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు బీజేపీ నేతలు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నారని  టీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే సుమన్ కామెంట్ చేయడం చిచ్చురేపింది. గతంలో సినీ నటుల విషయంలో జరిగిన కేసు ఏమైందని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆ కేసులో హీరోయిన్లు కూడా ఉండేవారని చెప్పారు. కానీ వారి పేర్లను మంత్రి కేటీఆర్ తొలగించారని రాజాసింగ్ ఆరోపించారు. బయటకు రాకుండా చేశారని విమర్శించారు. ఆ ఫైల్ మూటగట్టి పక్కనపడేశారని తెలిపారు.అంతేకాదు.. పట్టుబడిన వారిలో కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించారు. మరి మిగతా వారి సంగతి ఏంటని అడిగారు. వారిని ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ లోని పబ్ లో రెండు రోజుల కింద డ్రగ్స్ బయటపడడం కలకలం రేపింది. ఇక్కడ పార్టీ చేసుకున్న వారిని విచారించిన పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు, వారి పిల్లలు ఉండడంతో ఇది చర్చనీయాంశమైంది. హైదరాబాద్ సిటీలో వరుసగా బయటపడుతున్న డ్రగ్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రగ్స్ దందాపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా చర్యలు చేపట్టారు.  ఇంతలోనే మరోసారి పబ్ లో డ్రగ్స్ బయటపడడం సంచలనమైంది.

ఇక దాడి సమయంలో ఈ పబ్ లో 5 గ్రాముల కొకైన్ ను స్వాధీన చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే రైడ్ సమయంలో పబ్లో 148 మంది ఉన్నారని, వీరిలో కొందరు డ్రింక్ లో కొకైన్ వేసుకొకున్నట్లు గుర్తించామన్నారు. అయితే డ్రగ్స్ ను ఎవరు వినియోగించారన్నది అప్పుడే చెప్పలేమని, విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు.

అందువల్ల అప్పుడే పబ్లోకి వచ్చిన వివరాలు వెల్లడించొద్దన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్ లను అరెస్టు చేయగా.. మరో నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఇతడి కోసం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల దాడిలో దొరికిన 45మంది రక్త నమూనాలు సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.  ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించారని సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కొత్త సీఐగా నాగేశ్వర్ రావును నియమించారు. ప్రస్తుతం ఈయన సారథ్యంలోనే కేసు విచారణ జరుగుతోంది.
Tags:    

Similar News