నిన్న యూపీ .. నేడు హర్యానా .. రైతులపైకి దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు

Update: 2021-10-07 12:17 GMT
లఖీమ్‌ పూర్‌ హింసాత్మక ఘటన మరిచిపోక ముందే అలాంటి ఘటన చోటు చేసుకుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. హర్యానాలో బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు రైతులు ఆరోపించారు. గాయపడిన రైతును అంబాల సమీపంలోని నారిన్‌గఢ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం పంపామని రైతులు చెబుతున్నారు. అతడి పరిస్థితి సీరియస్‌ గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

తనపైకి బీజేపీ ఎంపీ కారు దూసుకురాగా తృటిలో తప్పించుకున్నట్లు ఒక రైతు ఆరోపించాడు. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ, హర్యానా మైనింగ్ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర పార్టీ నాయకులు గురువారం నారిన్‌గఢ్‌లోని సైనీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. క బీజేపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఆ భవనం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కార్యక్రమం ముగియడంతో బయటకు వచ్చిన బీజేపీ ఎంపీ నయాబ్‌ సైనీ కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని హర్యానా రైతులు డిమాండ్‌ చేశారు.

ఉత్తరప్రదేశ్‌ లోని లఖీమ్‌పూర్‌ ఖేరిలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కు చెందిన కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఆ ఘటన చోటు చేసుకున్న నాలుగు రోజుల తర్వాత హర్యానాలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అయితే రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్దమేనని ఆశిష్ మిశ్రా తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లఖీమ్‌ పూర్ ఘటన చర్చకు దారితీసింది. నిరసన చేస్తోన్న రైతులపై వాహనం వెళ్లనీయడం, తర్వాత జరిగిన ఉద్రిక్తతలతో 9 మంది వరకు చనిపోయారు. లఖింపూర్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఘటనకు కారణమైన వారిని ఎంత మందిని గుర్తించారు, ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై తమకు ప్రభుత్వం నుంచి రిపోర్ట్ కావాలని ధర్మాసనం ఆదేశించింది. నలుగురు రైతులు సహా ఎనిమిది చనిపోయిన ఈ ఘటనలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి సుప్రీం ఆరా తీసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారును నడపడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌ లోని లఖింపూర్‌ లో ఆదివారం ఘటన జరగగా.. యూపీనే కాకుండా మొత్తం దేశాన్ని కుదిపివేసింది. కేంద్ర మంత్రిపై అతడి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.



Tags:    

Similar News