ఆ ప్రసిద్ధ మ‌సీదు కూడా ఆల‌య‌మేన‌ట‌!

Update: 2017-12-07 12:39 GMT
బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వింత‌ల్లో ఒక‌టిగా ప్ర‌ఖ్యాతి గాంచిన తాజ్ మ‌హ‌ల్ ఓ శివాలయమని క‌టియార్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. ఒక‌ప్ప‌టి తేజో మ‌హ‌ల్....ఇపుడు తాజ్ మ‌హ‌ల్ గా ప్ర‌సిద్ధి చెందింద‌ని - మొఘ‌లులు ఆ శివాల‌యాన్ని నాశ‌నం చేసి తాజ్ మ‌హ‌ల్ ను నిర్మించార‌ని ఆయ‌న ఆరోపించారు. తాజాగా, క‌టియార్ మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని జామా మసీదు కూడా ఒకప్ప‌టి హిందూ దేవాలయమేన‌ని క‌టియార్ అన్నారు. ఒకప్పటి జమునా దేవి ఆలయాన్ని  మొఘలులు ధ్వంసం చేసి జామా మసీదు కట్టారని తెలిపారు.

క్రీ.శ.17వ శతాబ్దంలో జ‌మునా దేవి ఆల‌యాన్ని షాజహాన్ ధ్వంసం చేసి జామా మసీదు కట్టారని క‌టియార్ అన్నారు. దేశ‌వ్యాప్తంగా దాదాపు 6000ల‌కు పైగా క‌ట్ట‌డాల‌ను మొఘ‌లులు ధ్వంసం చేశార‌ని ఆరోపించారు. మ‌రోవైపు, క‌టియార్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మండిప‌డింది. బీజేపీ పాల‌న‌లో అభివృద్ధి శూన్య‌మ‌ని - ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డానికి బీజేపీ నాయకులు ఇటువంటి అర్ధం ప‌ర్థంలేని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని  కాంగ్రెస్ నాయ‌కుడు రాజ్ బ‌బ్బ‌ర్ అన్నారు. క‌టియార్ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే బీజేపీ నేత‌లు ఈ త‌ర‌హా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారని ప‌లువురు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.గుజ‌రాత్ ఎన్నిక‌లలో మైలేజ్ పొంద‌డానికే ఈ స‌మ‌యంలో అటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి అంశాల‌ను తెర‌పైకి తెచ్చి ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించాల‌ని బీజేపీ నేత‌లు చూస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.గ‌తంలో, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ టూరిజం బ్రౌచ‌ర్ నుంచి తాజ్ మ‌హ‌ల్ పేరును ప్ర‌భుత్వం తొల‌గించ‌డంతో పెను దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News