బీజేపీ ఈ సాహ‌సం చేయ‌గ‌లదా?

Update: 2018-02-12 23:30 GMT
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత ధ‌నిక రాష్ట్రంగా అవ‌త‌రించిన తెలంగాణ ప‌రిస్థితిని ప‌క్క‌న‌బెడితే... రాజ‌ధాని కూడా లేకుండా ఏర్ప‌డ్డ న‌వ్యాంధ్ర లోటు బ‌డ్జెట్ - నిధుల లేమితో ఆర్థిక స‌మ‌స్య‌ల్లో కూరుకుపోయింది. ఈ వెత‌ల నుంచి ఏపీకి బ‌య‌ట‌ప‌డ‌వేసేందుకు నాటి యూపీఏ స‌ర్కారు విభ‌జ‌న చ‌ట్టంలో ప‌లు అంశాల‌ను పేర్కొంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంతో పాటుగా విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ - అవ‌కాశం ఉన్నంత మేర జాతీయ సంస్థ‌ల ఏర్పాటు... లోటు బ‌డ్జెట్‌ను భ‌ర్తీ చేసేందుకు ఇతోదికంగా ఆర్థిక సాయం తదిత‌రాల‌న్నీ ఆ చ‌ట్టంలో ఉన్నాయి. దీనిపై నాడు రాజ్య‌స‌భలో చ‌ర్చ సంద‌ర్భంగా నాడు ప్ర‌ధాన‌మంత్రి హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌సంగిస్తూ... ఏపీకి ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామంటే... 15 ఏళ్ల పాటు ఇవ్వాల్సిందేన‌ని నాడు విప‌క్ష స‌భ్యుడిగా ఉన్న ప్ర‌స్తుత భార‌త ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు గ‌ళ‌మెత్తి మ‌రీ డిమాండ్ చేశారు. మొత్తానికి నాటి చ‌ర్చ ఎలా సాగినా... రాష్ట్రాన్ని విభ‌జించేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో యూపీఏ అడ్రెస్ గ‌ల్లంతు కాగా... ప్ర‌జాక‌ర్ష‌క పాల‌న‌, అవినీతి వ్య‌తిరేక పాల‌న అందిస్తామంటూ డాంబికాలు ప‌లికిన న‌రేంద్ర మోదీ మాట‌లు న‌మ్మిన జ‌నం బీజేపీతో పాటు ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు ఓట్లేశారు. ఫ‌లితంగా యూపీఏ స‌ర్కారు గ‌ద్దె దిగ‌గా... మోదీ నేతృత్వంలో ఎన్డీఏ స‌ర్కారు పాల‌నా ప‌గ్గాల‌ను చేప‌ట్టింది.

ఇది జ‌రిగి ఇప్ప‌టికే నాలుగేళ్లు కావ‌స్తోంది. ఇప్ప‌టిదాకా ఎన్డీఏ స‌ర్కారు నాలుగు పూర్తి స్థాయి బ‌డ్జెట్ ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. మొన్న‌టి తాజా బ‌డ్జెట్ ను ప‌క్క‌న‌పెడితే.. అంత‌కుముందు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ లలో ఏపీకి అర‌కొర కేటాయింపులే ద‌క్కాయి. ఇక చివ‌రి బ‌డ్జెట్ అయిన తాజా బ‌డ్జెట్‌లో గ‌త బ‌డ్జెట్ ల‌కు భిన్నంగా అర‌కొర కేటాయింపులు కూడా ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల నుంచే కాకుండా మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నుంచి కూడా నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో 27 పేజీల‌తో కూడిన ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది. ఏపీకి ఇప్ప‌టిదాకా ఏమేం చేశామ‌న్న వివ‌రాల‌ను అందులో పొందుప‌ర్చిన బీజేపీ... ఇత‌ర రాష్ట్రాల‌కు రెగ్యుల‌ర్‌ గా ఇస్తున్న నిధుల‌ను ఏపీకి విడుద‌ల చేసినా... వాటిని కూడా ఏపీకి ప్ర‌త్యేకంగా కేటాయిస్తున్న నిధుల్లాగే ప‌రిగ‌ణించి వాటిని కూడా 27 పేజీల లేఖ‌లో ప్ర‌స్తావించిన‌ట్లుగా స‌మాచారం. అయితే ఈ లేఖ పూర్తి పాఠం బ‌హిరంగం కాలేద‌న్న చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఓ వైపు ఏపీకి ఎంతో చేశామ‌ని బీజేపీ చెప్పుకుంటూ ఉంటే... కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది చాలా త‌క్కువేన‌ని టీడీపీ వాదిస్తోంది. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే న‌డుస్తోంద‌న్న వాద‌న లేక‌పోలేదు. అయినా ఏపీకి ఎంతో మేర సాయం చేసిన బీజేపీ స‌ర్కారు... ఇప్పుడు కొత్త‌గా విడుద‌ల చేసిన 27 పేజీల లేఖ‌ను త‌న ఫేస్ బుక్ ఖాతాలోనో - ట్విట్ట‌ర్ ఖాతాలోనో ఎందుకు పెట్ట‌డం లేద‌న్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌గా మారింది.

సోష‌ల్ మీడియాలో స‌ద‌రు లేఖ‌ను పెట్ట‌లేమ‌ని ఆ పార్టీ భావిస్తే... క‌నీసం మీడియాకైనా స‌ద‌రు లేఖ పూర్తి పాఠాన్ని విడుద‌ల చేస్తే స‌రిపోతుంది క‌దా అన్న వాద‌న ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. ఏపీకి న్యాయం చేసే విష‌యంలో చిత్త‌శుద్దితోనే బీజేపీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించి ఉంటే... ఆ లేఖ‌ను బ‌య‌ట‌పెట్టే విష‌యంలో జంకాల్సిన అవ‌స‌రమే లేద‌న్న‌ది జ‌నం మాట‌. అంతేకాకుండా ఈ లేఖ‌ను బ‌హిరంగం చేసేందుకు బీజేపీ వెనుకాడుతున్న‌దంటే... ఏపీకి ఆ పార్టీ ప్ర‌భుత్వం అన్యాయం చేసింద‌ని న‌మ్మ‌క త‌ప్ప‌ద‌న్న మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా బీజేపీ త‌న చిత్త‌శుద్ధిని నిరూపించుకునేందుకు వ‌చ్చిన ఈ అవ‌కాశాన్ని ఎందుకు స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేద‌న్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీకి న్యాయం చేసిన పార్టీగా బీజేపీకి ఓ ముద్ర వేసిన ఏపీ నెటిజ‌న్లు... ఆ పార్టీ అధికారిక ఫేస్ బుక్‌ కు వేలాది కామెంట్ల‌ను పోస్ట్ చేశారు. ఈ దెబ్బ‌కు బీజేపీ త‌న ఫేస్ బుక్ కు ఉన్న రివ్యూ ఆప్ష‌న్ ను కూడా తొల‌గించేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ 27 పేజీల త‌న లేఖ‌ను బ‌హిరంగం చేస్తుందా? అన్న‌ది దాదాపుగా అసాధ్య‌మేన‌న్న విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. మొత్తంగా 27 పేజీల లేఖ‌ను విడుద‌ల చేసిన‌ట్లుగా చెబుతున్న బీజేపీ... త‌న‌ను తానే దోషిగా చెప్పేసుకుంద‌న్న మాట‌.

Tags:    

Similar News