అన్న గారి కుమార్తె ఆశలకు బ్రేక్... బీజేపీలో చిన్నబోవడమేనా...?

Update: 2022-09-15 00:30 GMT
ఆమె విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి ద్వితీయ పుత్రిక. రాజకీయ రంగాన తనదైన ప్రతిభను చూపించిన తెలుగు వల్లభుడికి వారసురాలు. దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ఏలుబడిలో పనిచేశారు. ఇదే చిత్రం. అన్న గారు కాంగ్రెస్ ని కుక్క మూతి పిందెలతో పోల్చారు. గత కాలం కాంగ్రెస్ కానే కాదని అన్నారు. అలాంటిది అన్న గారు ద్వేషించిన పార్టీలో చిన్నమ్మ చేరి పదవులు పొందారు. రెండు సార్లు ఎంపీ అయ్యారు.

విభజన తరువాత కాంగ్రెస్ సీన్ కాలడంతో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి హోదా ఉంది. ఎన్టీయార్ కుమార్తె అన్న ట్యాగ్ ఉంది. దాంతో బీజేపీ ఆమె మీద చాలా హోప్స్ పెట్టుకుని సమాదరించింది. అయితే చిన్నమ్మ ఎప్పటికీ బీజేపీకి పెద్దమ్మ కాలేకపోతున్నారు. ఆమె ఏపీ బీజేపీని ఎంతో కొంత పటిష్టం చేసే దిశగా ఆలోచనలు చేయలేకపోతున్నారు. ఇది కేంద్ర బీజేపీ వారికి ఆమె మీద ఉన్న అసంతృప్తి.

ఇక బీజేపీలో చేరితే రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, ఏదో నాటికి ఏపీ నుంచి మరోసారి కేంద్ర మంత్రి కాబోతానా అని చిన్నమ్మ పెట్టుకున్న ఆశలన్నీ మెల్లగా ఆవిరి కావడం జరిగింది. ఇక ఆమెకు మొదట్లో తగిన గుర్తింపు పార్టీ పరంగా కూడా లేదు. అయితే ఆ తరువాత ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. ఒడిషా చత్తీస్ ఘడ్ లకు ఆమెను ఇంచార్జిగా పార్టీ నియమించింది.

దాంతో బాగానే ఉంది అనుకునే లోపే అంతా తారు మారు అవుతోంది. ముందు ఒడిషా బాధ్యతలు పీకేసారు. ఇపుడు తాపీగా చత్తీస్ ఘడ్ బాధ్యతలు కూడా లాగేసారు. ఇపుడు చిన్నమ్మకు బీజేపీలో ఏ బాధ్యతా లేదు. దాంతో ఆమెకు కొంత బెంగ పట్టుకుంది అని అంటున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆ విధంగా గెలిచి మళ్లీ కేంద్రంలో మంత్రి కావాలని తలపోస్తున్నారు.

అయితే ఈసారి విశఖ ఎంపీ టికెట్ దక్కదని అంటున్నారు. ఆ సీటు మీద మొదటి నుంచి కన్నేసిన ఒక కీలక నాయకుడు తనకు ఉన్న పరిచయాలతో కేంద్ర నాయకత్వం నుంచి భరోసా పొందారని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి చిన్నమ్మకు సీటు దక్కదనే అంటున్నారు. దాంతో ఆమె రాజకీయం బీజేపీలో ఏమీ అర్ధం కాకుండా ఉందిట.

ఇక ఆమెను ఏపీ బీజేపీలో చేరికల కమిటీ చైర్ పర్సన్ గా నియమించారు. ఈ పదవి ఒక్కటే ఆమెకు మిగిలింది అని చెబుతున్నారు. ఈ పదవికి ఆమె ఏమైనా న్యాయం చేస్తే ఏమైనా ఆశలు కమలం పార్టీలో ఉంటాయని అంటున్నారు. చేరికలు అంటే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేర్పించాలి అని అంటున్నారు.

మరి ఎన్టీయార్ పెట్టిన పార్టీ నుంచి ఆయన కుమార్తె  ద్వారా  పెద్ద ఎత్తున నాయకులు రావాలన్నది బీజేపీ ఆశ. కానీ ఆ విధంగా జరుగుతుందా అంటే ఎవరూ చెప్పలేరు. దాంతో చిన్నమ్మ ముందు ఇపుడు పెను సవాల్ ఉంది. ఆమె తన పట్టుని నిరూపించుకోకపోతే బీజేపీ ఇలాగే పెద్దగా పట్టించుకోదు అని అంటున్నారు. చూడాలి మరి చిన్నమ్మ రాజకీయ చక్రం గిర్రున బీజేపీలో తిరుగుతుందో లేదో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News