అడ్డంగా బుక్కైన బీజేపీ కాంగ్రెస్ నేత భార్య ఫొటోతో భారీ ట్రోలింగ్!

Update: 2021-03-31 23:30 GMT
సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం పులిపై స‌వారీ చేయ‌డ లాంటిది.. స‌రిగ్గా స‌వారీ చేస్తున్నంత సేపు ఓకే.. కానీ.. ఏ చిన్న త‌ప్పు చేసినా న‌మిలి మింగేస్తుంది. ఇప్పుడు త‌మిళ‌నాట ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంది. కాంగ్రెస్ నేత భార్య ఫొటోతో స‌రిదిద్దుకోలేని త‌ప్పిదం చేసింది. అది కూడా ప్ర‌ధాన మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తున్న రోజునే కావ‌డంతో.. విప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల జోరు ప‌తాక స్థాయికి చేరింది. అస్త్ర‌శ‌స్త్రాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్న పార్టీలు.. అధికారం త‌మ‌దేనంటూ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. ఇక‌, సోష‌ల్ మీడియా వ్య‌వ‌హారం ఎలా ఉందో తెలిసిందే. త‌మ గొప్ప‌లు చెప్పుకోవ‌డం క‌న్నా.. అవ‌త‌లి వారిపై రాళ్లు విస‌ర‌డ‌మే ఎక్కువ‌గా ఉంటోంది.

కాగా.. ఎన్నిక‌ల ప్ర‌చారం నేప‌థ్యంలో బీజేపీ సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. క‌మ‌లం గుర్తుకే ఓటు వేయాలంటూ అందులో కోరింది. అయితే.. ఈ వీడియోలో ఓ భ‌ర‌తనాట్య క‌ళాకారిణి ఫొటోను వాడారు. అయితే.. ఆ ఫొటో మ‌రెవ‌రిదో కాదు.. కాంగ్రెస్ యువ నాయ‌కుడు కార్తీ చిదంబ‌రం భార్య శ్రీనిధి చిదంబ‌రం ఫొటో. ఈమె త‌మిళ‌నాట గుర్తింపు పొందిన భ‌ర‌త నాట్య క‌ళాకారిణి. అంతేకాదు.. ఆమె ప్ర‌ముఖ వైద్యురాలు కూడా.

శ్రీనిధి ఫొటో ఉప‌యోగించ‌డంతో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టింది కాంగ్రెస్‌. అనుమ‌తి లేకుండా ఆమె ఫొటోను ఎలా వాడుకుంటారంటూ కాంగ్రెస్ నేత‌లు దాడి మొద‌లు పెట్టారు. ఇత‌రుల అనుమ‌తి తీసుకునే అల‌వాటే మీకు లేదుక‌దా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించిన బీజేపీ.. సోష‌ల్ మీడియా నుంచి వీడియోను తొల‌గించిన‌ప్ప‌టికీ.. అప్ప‌టికే అది ఎన్నో గ్రూపుల‌లో షేర్ అయిపోయి ఉంది. దీంతో.. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ప‌డిపోయారు ఆ పార్టీ నేత‌లు.

అటు శ్రీనిధి చిదంబ‌రం కూడా త‌న ఫొటో ఉప‌యోగించినందుకు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా త‌మిళ‌నాట క‌మ‌లం విక‌సించే అవ‌కాశ‌మే లేదంటూ ఎద్దేవా చేశారు. ఇంకోవైపు సోష‌ల్ మీడియాలోనూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.
Tags:    

Similar News