మోడీ.. కేసీఆర్ స్నేహం లక్ష్మ‌ణ్‌ కు తెలీదా?

Update: 2018-06-30 05:01 GMT
ఓప‌క్క ఢిల్లీలో ప్ర‌ధాని మోడీతో స్నేహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై ఇప్ప‌డిప్పుడే క్లారిటీ వ‌స్తున్న ప‌రిస్థితి. దీనికి త‌గ్గ‌ట్లే.. త‌న‌కు న‌చ్చ‌ని వారికి బిజీ.. బిజీ అంటూ అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ప్ర‌ధాని మోడీ.. మంత్రి కేటీఆర్ కోరినంత‌నే అపాయింట్ మెంట్ ఇచ్చేయ‌ట‌మే కాదు.. అపాయ్యంగా మాట్లాడిన తీరు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

గ‌తంలో కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగితే.. వారాల త‌ర‌బ‌డి వెయిట్ చేయాల్సి వ‌చ్చేది. అందుకు భిన్నంగా ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కేంద్ర‌మంత్రితో మాట్లాడితే స‌రిపోయే అంశానికి సైతం ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యేందుకు మంత్రి కేటీఆర్ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం.. దానికి త‌గ్గ‌ట్లే మోడీ రియాక్ట్ కావ‌టం క‌నిపిస్తుంది.

ఢిల్లీ స్థాయిలో బీజేపీ.. టీఆర్ ఎస్ మ‌ధ్య స‌హృద్బావ వాతావ‌ర‌ణం వెల్లివిరిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మండిపాటు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఢిల్లీస్థాయిలో త‌మ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు మొయింటైన్ చేస్తున్న కేసీఆర్ అండ్ కోపై ల‌క్ష్మ‌ణ్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు

తాజాగా నిర్వ‌హించిన జ‌న‌చైత‌న్య యాత్ర‌లో భాగంగా సంగారెడ్డిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో టీఆర్ ఎస్ పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. హిందువుల‌ను.. హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌రిచే మ‌జ్లిస్ పార్టీ వ‌ద్ద సీఎం కేసీఆర్ మోక‌రిల్లారంటూ మండిప‌డ్డారు. గ‌ల్లీకి ప‌రిమిత‌మైన పార్టీని నెత్తిన పెట్టుకున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

గ‌తంలో మ‌జ్లిస్ ను కాంగ్రెస్ అక్కున చేర్చుకుంద‌ని.. ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీ అదే ప‌ని చేస్తోంద‌న్నారు. రెండు పార్టీలు వేర్వేరు కాద‌ని.. ఒక్క‌టేన‌ని ఆరోపించారు. రెండు పార్టీలు వేర్వేరు కాద‌ని.. ఒక్క‌టేన‌ని మండిప‌డ్డారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ .. ఫాంహౌస్ అడ్డాగా చేసుకొని కేసీఆర్ రాచ‌రిక పాల‌నను సాగిస్తున్నార‌ని.. రాష్ట్రంలో అభివృద్ధి.. సంక్షేమాన్ని విస్మ‌రిస్తున్న‌ట్లు చెప్పారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌.. ఫ్యామిలీ ఫ్రంట్ అంటూ డ్రామాలు ఆడుతున్నార‌ని.. ఎర్ర‌వ‌ల్లిలో క‌ట్టిన డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను చూపిస్తూ రాష్ట్రం మొత్తం క‌డుతున్న‌ట్లు చెప్ప‌టం స‌రికాదంటూ ఫైర్ అయ్యారు.

టీఆర్ ఎస్ స‌ర్కారును ఎన్నిక‌ల్లో పాత‌రేసేందుకు ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పిన ల‌క్ష్మ‌ణ్.. గ‌ద్వాల‌లో కేసీఆర్ వేసిన పునాది రాయి.. టీఆర్ ఎస్‌ కు స‌మాధి రాయి కావ‌టం ఖాయ‌మంటూ నిప్పులు చెరిగారు. తాము చేప‌ట్టిన జ‌న చైత‌న్య యాత్ర‌ల‌కు అనూహ్య స్పంద‌న వ‌స్తున్న‌ట్లు చెప్పిన లక్ష్మ‌ణ్‌.. ఢిల్లీ స్థాయిలో త‌మ పెద్ద సారుతో కేసీఆర్‌కు పెరుగుతున్న అనుబంధం గురించి తెలీక‌.. ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారా? అన్న‌ది చెక్ చేసుకుంటే మంచిదేమో ల‌క్ష్మ‌ణ్ భ‌య్‌.
Tags:    

Similar News