బీహార్‌ లో బీజేపీ రాజ‌కీయ వ్యూహం చూశారా?

Update: 2017-07-11 05:02 GMT
జాతీయ రాజ‌కీయాల్లో అతిర‌థ మ‌హారథుల్లాంటి నేత‌లున్న బీహార్‌ లో ఇప్పుడు ప‌రిస్థితి అయోమ‌యంగా మారింద‌నే చెప్పాలి. ఆ రాష్ట్ర అసెంబ్లీకి గ‌త కొంత‌కాలం క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం సీఎం ప‌ద‌విని అధిష్టించేందుకు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి - జేడీయూ సీనియ‌ర్ నేత నితీశ్ కుమార్ ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దిలారు. ఒంట‌రిగా బ‌రిలోకి దిగితే క‌ష్ట‌మేన‌ని భావించిన ఆయ‌న... లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీతో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ తోనూ జ‌ట్టు క‌ట్టి క‌ద‌న రంగంలోకి దూకారు. ఇక పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌లను అప్ప‌టికే ఖ‌రారు చేసుకున్న ఆయ‌న... ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చిన బీజేపీని చిత్తు చేసి మ‌రీ హ్యాట్రిక్ సీఎం అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యంతో జాతీయ స్థాయిలో మ‌హా కూట‌మి దిశ‌గా అడుగులు వేసేందుకు లాలూ ప్ర‌సాద్ ఆస‌క్తి చూపారు. పొరుగు రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో నాడు అధికారంలో ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ అధినేత‌ - త‌న వియ్యంకుడు ములాయం సింగ్ యాద‌వ్‌ తో ఈ దిశగా ఆయ‌న చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. ఇందుకు నితీశ్ కూడా మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లు నాడు వార్త‌లు వినిపించాయి.

అయితే ఇప్పుడంతా అక్క‌డి ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. మ‌హా కూట‌మి ఏర్పాటు దేవుడెరుగు... బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మూడు పార్టీల కూట‌మి ఇప్పుడు ముక్క‌లు చెక్క‌ల‌య్యే ప‌రిస్థితి నెలకొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా బీహార్ గ‌వ‌ర్నర్‌ గా ప‌నిచేస్తున్న రామ్‌ నాథ్ కోవింద్‌ ను ప్ర‌క‌టించిన బీజేపీ అధిష్ఠానం చాలా తెలివిగా పావులు క‌దిపింది. కోవింద్‌ తో స‌న్నిహిత సంబంధాలు - త‌మ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాష్ట్రప‌తిగా మారుతున్న ద‌రిమిలా... నితీశ్ త‌న‌కు రాజ‌కీయ శ‌త్రువుగా ఉన్న ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఇచ్చేందుకే మొగ్గు చూపారు. అయితే అప్ప‌టికే యూపీఏ కూడా రాష్ట్రప‌తి బ‌రిలోకి దిగేందుకు సిద్ధం కావ‌డం, ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో బీహార్‌ లో నితీశ్ పొత్తు కొన‌సాగిస్తున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్‌ తో పాటు బీజేపీని ఆది నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న లాలూ ప్ర‌సాద్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలో ఈ మూడు పార్టీల కూట‌మి ముక్క‌లు కానుంద‌న్న వాద‌న వినిపించింది. అయితే కేవ‌లం రాష్ట్రప‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు మాత్ర‌మే... ఎన్డీఏకు నితీశ్ మ‌ద్ద‌తిస్తార‌ని, మిగిలిన విష‌యాల్లో ఆయ‌న త‌న కూట‌మి బాట‌లోనే న‌డుస్తార‌ని అంతా భావించారు. అయితే అక్క‌డి ప‌రిస్థితుల‌ను బేరీజు వేసిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు చాలా చురుగ్గా పావులు క‌దిపింది. ఇంకేముంది... లాలూపై అప్ప‌టిదాకా పెండింగ్‌ లో ఉన్న కేసులు - వెల్లువెత్తిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ షురూ అయ్యింది. అటు సీబీఐతో పాటు ఇటు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కూడా లాలూ అండ్ ఫ్యామిలీపై వ‌రుస దాడులు చేసింది. ఈ నేప‌థ్యంలో త‌న కేబినెట్ లో డిప్యూటీ సీఎం - మ‌రో కీల‌క మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న లాలూ కుమారులను సాగ‌నంపే విష‌యాన్ని నితీశ్ ప‌రిశీలిస్తున్నార‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇదే అద‌నుగా బీజేపీ త‌న పాశుప‌తాస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసింది. అవినీతిలో కూరుకుపోయిన లాలూ ఫ్యామిలీ కారణంగా నితీశ్... ఆర్జేడీ - కాంగ్రెస్‌ ల‌తో క‌లిసిన కూట‌మికి గుడ్ బై చెప్పేస్తే... ఆయ‌న స‌ర్కారును తాము కాపాడ‌తామంటూ ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. నితీశ్ స‌ర్కారుకు మ‌ద్ద‌తిచ్చినా... ఆయ‌న కేబినెట్‌లో తామేమీ చేర‌బోమ‌ని, బ‌య‌ట నుంచే మ‌ద్ద‌తిస్తామ‌ని బీజేపీ బీహార్ అధ్య‌క్షుడు - ఉపాధ్య‌క్షుడు నిన్న వేర్వేరుగా చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రింత వేడిని రాజేసింది. ప‌రిస్థితి చూస్తుంటే... నితీశ్ మ‌హా కూట‌మి మాట‌ను ప‌క్క‌న‌పెట్టేసి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరిపోవ‌డం ఖాయ‌మైపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News