జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడులో దుమారం.. బీజేపీ సీరియస్

Update: 2022-10-20 08:50 GMT
మునుగోడులో రాజకీయం వ్యక్తిగత వైరానికి దారితీస్తోంది.  అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైట్ నడుస్తోంది. రెండు పార్టీలు వ్యక్తిగత విమర్శల వరకూ వెళుతున్నాయి. ప్రత్యర్థి నేతలను టార్గెట్ చేసి పరువు తీసే పనులు చేస్తున్నాయి. పోస్టర్లతో టీఆర్ఎస్ బీజేపీని ఇరుకునపెడుతోంది.

ఇప్పటికే హుజూరాబాద్ ప్రజల పేరిట మునుగోడులో టీఆర్ఎస్ పోస్టర్లు బీజేపీని కలవరపెట్టాయి. తాజాగా మునుగోడులో ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘోరీ కట్టడం (సమాధి) పెనుదమారం రేపింది. ఇది టీఆర్ఎస్ చేసిన పనియే అని బీజేపీ ఆరోపిస్తోంది.

మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టడం ఇప్పుడు మునుగోడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో జేపీ నడ్డాకు గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టారు. మట్టితో సమాధిని ఏర్పాటు చేసి ఆ సమాధిపై జేపీ నడ్డా ఫొటోను ను పెట్టి పూలమాల వేసి పసుపు, కుంకుమ చల్లి హంగామా చేశారు.

జేపీ నడ్డాతో ఫొటోలో ఏర్పాటు చేసిన పోస్టర్ లో రీజినల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చౌటుప్పల్ అని రాసి ఉంది. మునుగోడుకు ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఇవ్వనందుకు జేపీ నడ్డాకు సమాధి కట్టినట్టు స్తానికంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ పనిచేసింది  టీఆర్ఎస్ కార్యకర్తలేనన్న టాక్ వినిపిస్తోంది.

2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడలో పర్యటించి చౌటుప్పల్ లో ఖచ్చితంగా ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు. ఇక అదే సంవత్సరం 8.2 ఎకరాల స్తలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ సెంటర్ కోసం చౌటుప్పల్ లోని దండు మల్కాపురంలో కేటాయించింది. ఇప్పటివరకూ అక్కడ కేంద్రప్రబుత్వం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని గుర్తు చేస్తూ జేపీ నడ్డాకు సమాధి కట్టారు. ఇలా జేపీ నడ్డాకు గుర్తు చేశారు.

ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంతలా దిగజారుతారా? అంటూ టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాంచంద్రరావు ట్వీట్ చేశారు. వీడియోలో ఇది కొందరు టీఆర్ఎస్ చేసిన పని అని.. దీనిని సహించేది లేదని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News