రాజస్థాన్ లో బీజేపీకి శృంగభంగమేనా?

Update: 2020-07-13 11:30 GMT
ఓ కర్ణాటక, ఓ మధ్యప్రదేశ్.. ఇప్పుడు రాజస్థాన్. ఇలా వరుసగా బీజేపీకి బలం లేకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే శివసేన ముందర బీజేపీ పప్పులు ఉడకలేవు. అక్కడ పార్టీలు పట్టుదలతో ఉండడంతో బీజేపీకి అధికార శృంగభంగం ఎందురైంది. కానీ కర్ణాటక, మధ్యప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ ను కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంది.. బోటా బోటా మెజార్టీతో ఉన్న మధ్యప్రదేశ్ లో ఈ కరోనావ్యాప్తికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గద్దెనెక్కింది. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాధిత్య సింధియాను బీజేపీవైపు తిప్పుకొని ఎమ్మెల్యేలను లాగేసి కొలువుదీరింది.

ఇప్పుడు బీజేపీ చూపు రాజస్థాన్ పై  పడింది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరడానికి క్యాంప్ కట్టాడు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు, మంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా అలజడి సృష్టించేందుకు బీజేపీ పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ మాదిరిగా రాజస్థాన్ లోనూ బీజేపీ రాజకీయం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికీ డబ్బులు.. మరికొందరికీ పదవులు ఇస్తామని మభ్య పెడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ లోలాగే ఇప్పుడు రాజస్థాన్ లోనూ బీజేపీ అదే పాచిక విసిరింది. మరి ఇక్కడ అది సాధ్యమవుతుందా.. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో బీజేపీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పం. అందుకే ఓ 20మంది లోపే ఎమ్మెల్యేలను లాగేసి ఈజీగా అక్కడి ప్రభుత్వాలను హస్తగతం చేసుకున్నాయి. కానీ రాజస్థాన్ లో తేడా బాగా ఉంది. అదే ఇప్పుడు బీజేపీకి శరాఘాతంగా మారింది.

ప్రస్తుతం రాజస్థాన్ లో మొత్తం శాసనసభ స్థానాలు 200 ఉన్నాయి.కాంగ్రెస్ కూటమికి 122 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ కూటమికి 75మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వం నిలబడాలంటే మెజారిటీ 101. దీంతో ఈ నంబర్ గేమ్ లో తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ వెంట ఎంతమంది ఉన్నారన్నదే ఇప్పుడు అసలు పాయింట్.

తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నాడు. అంటే కాంగ్రెస్ బలం 92కి పడిపోయి ప్రభుత్వం కూలుతుంది. అయితే ఆ 30మంది సచిన్ పైలట్ వెంట నడుస్తారా? అపరచాణిక్యుడు సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ చీల్చి తనతోపాటు ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాడా అన్నది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. కావాల్సిన ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్, బీజేపీకి మధ్య చాలా అంతరం ఉండడంతో ఈ కూల్చివేత అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల వాదన.. మరి బీజేపీ ఏం చేస్తుందనేది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News