జగన్ గురించి జనం ఏమనుకుంటారు...బీజేపీ ఇంటరెస్టింగ్ సర్వే...?

Update: 2022-10-27 08:30 GMT
తన పార్టీ గురించి సర్వే చేసుకోవడం రాజకీయాలలో సహజమైన పరిణామం.  అయితే ఇతర పార్టీల ప్లస్ మైనస్ లను తెలుకుంటారు. కానీ కోరి మరీ అవతల పార్టీ గురించి సర్వే చేయించడం అంటే ఇందులో అతి తెలివి చాలానే ఉంటుంది మరి. ఇపుడు అలాంటి పనినే ఏపీ బీజేపీ చేస్తోంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ పని తీరు ఎలా ఉంది, ఆ పార్టీకి జనంలో ఉన్న వ్యతిరేకత ఏపాటిది అన్నది ఇపుడు బీజేపీకి అర్జంటుగా కావాలిట.

ఎందుకంటే ఏపీలో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కాలనుకుంటోంది. జాతీయ రాజకీయాల్లో కూడా బీజేపీకి సీట్లు కావాలి. ముచ్చటగా మూడవసారి కేంద్రంలో నరేంద్ర  మోడీ సర్కార్ అధికారంలోకి రావాలంటే  సౌత్ ఇండియా మీదనే ఈసారి ఫుల్ ఫోకస్ పెడుతోంది. అందులో ఏపీ మీద చాలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఏపీలో చూస్తే అన్నీ కావాల్సిన పార్టీలే. అందరూ మిత్రులే. ఈ మిత్రులలో గెలుపు మిత్రులు ఎవరు, తనకు ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే ఎన్నికల్లో అందించే మిత్రులు ఎవరు అన్నది ఇపుడు బీజేపీకి కావాలి.

అందుకోసమే బీజేపీ సర్వేని నమ్ముకుంటోంది అంటున్నారు. నిజానికి బీజేపీకి ఇప్పటికిపుడు ఈ సర్వే గొడవ అవసరం లేదు. కానీ మిత్రుడు జనసేనాని ఒక కీలకమైన స్టెప్ తీసుకున్నారు. ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో వైసీపీ నేతలకు మంత్రులకు చెప్పులు చూపిస్తూ ఘాటైన కామెంట్స్ చేసిన తరువాత వెంటనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరూ కలసి మీడియా ముందుకు వచ్చారు. దాంతో ఈ రెండు పార్టీల పొత్తు ఖరారు అయిపోయింది అని అంతా అనుకుంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీని మిత్రుడిగా ఏమీ వదులుకోవడంలేదు. ఆయన తానుగా నోటి వెంట కటీఫ్ చెప్పడంలేదు. కానీ నడిస్తే మాతో నడవాలి అన్నట్లుగానే ఆయన సందేశం ఉంది అంటున్నారు. టీడీపీతో తాను ఉండబోతున్నాను, బీజేపీ కూడా వచ్చి చేరితే మంచిది అన్నదే పవన్ ఆలోచనగా ఉంది. ఆ విషయం బీజేపీకి కూడా స్పష్టంగా తెలుసు. కానీ తెలుగుదేశంతో కలవమని చెబుతోంది. అయితే రేపటి ఎన్నికల్లో ఏ పార్టీ ఏపీలో గెలుస్తుంది అన్నదే బీజేపీకి పట్టుకున్న డౌట్.

ఇప్పటికైతే వైసీపీ మరోసారి గెలుస్తుంది అని బీజేపీకి ఎక్కడో నమ్మకం ఉన్నట్లుంది. అందుకే జగన్ని అనవసరంగా దూరం చేసుకోవడం ఇష్టం లేకనే టీడీపీతో జట్టు కట్టేది లేదు అంటోంది. అయితే రేపటి రోజున నిజంగా జగన్ ఓడి టీడీపీ గెలిస్తే అపుడు బీజేపీ సంగతేంటి. ఈ చర్చతో ఈ రకమైన ముందు చూపుతో ఇపుడు బీజేపీ సర్వేను నమ్ముకుంటోంది అంటున్నారు. ఈ సర్వే ద్వారా ఏపీలో వైసీపీ పాలన మీద జనాభిప్రాయం తీసుకోవడం తో పాటు జనసేన టీడీపీ కాంబో అవతల వైపు ఉండి ఇవతల వైసీపీ ఉంటే ఎవరు గెలుస్తారు అన్నది కూడా సర్వే ద్వారా ఒక అంచనాకు రావచ్చు అని బీజేపీ భావిస్తోంది అంటున్నారు.

ఈ సర్వేలో వైసీపీకే జనాదరణ ఉంటే మాత్రం బీజేపీ ఎప్పటిమాదిరిగానే టీడీపీతో కలవను అని చెబుతూ తన న్యూట్రల్ విధానాన్ని కొనసాగించవచ్చు అని అంటున్నారు. అలా కాకుండా జనసేన టీడీపీ కూటమి వైపు జనాలు మొగ్గితే మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ కూటమికే జై కొట్టి 2014 పొత్తుని రిపీట్ చేస్తుంది అని అంటున్నారు.

అంటే ఏపీలో గెలుపు గుర్రం వైపే ఉండాలని బీజేపీ గట్టిగా డిసైడ్ అయింది అన్న మాట. మరి బీజేపీ సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. అదే విధంగా ఏపీలో జనసేన టీడీపీ ఫ్యాక్టర్ ఎంతవరకూ పనిచేస్తుందో కూడా ఈ సర్వే ద్వారా తేలనుంది అంటున్నారు. సో బీజేపీ చేయించబోతున్న ఈ సర్వే వెరీ ఇంటరెస్టింగ్ అని అంటున్నారు  మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News