బీజేపీకి ఎమ్మెల్యేల ఆశ తీరలేదు!

Update: 2019-09-12 08:07 GMT
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ లోటస్’ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వచ్చే విజయదశమి పండుగ సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి సుమారు 12 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా జేడీఎస్ నుంచి ఎక్కువ మందికి బీజేపీ తీర్థం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్ – జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురయ్యారు.

వారి రాజీనామాలతో ఒక్కసారిగా అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 224 నుంచి 207కి పడిపోవడంతో మ్యాజిక్ నంబరు 104కు చేరింది. ఫలితంగా బల పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం సులువుగా నెగ్గింది. వచ్చే అక్టోబరులో శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు యడియూరప్ప ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు బీజేపీ యత్నిస్తోంది. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలకు గాలం వేసినట్లు తెలుస్తోంది.

సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలతో పాటు తాజాగా జేడీఎస్ కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  విజయదశమి పండుగ పూర్తి కాగానే వీరు బీజేపీలో చేరుతారని తెలిసింది. అంతేకాకుండా జేడీఎస్ ఎమ్మెల్సీ పుట్టణ్ణ - దాసరహళ్లి ఎమ్మెల్యే ఆర్.మంజునాథ కూడా కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
 
బీజేపీ నేతృత్వంలో తెరవెనుక నిర్వహించే ఆపరేషన్ కమల్ కర్ణాటకలో ఏడాది వ్యవధిలోనే ఆరుసార్లు విఫలమైంది. కాగా ఏడోసారి చాకచక్యంగా కమలనాథులు విజయం సాధించారు. ఫలితంగా కర్ణాటకలో అధికారం చేపట్టారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ నంబరుకు మరింత దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి మరో 12 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కర్ణాటకలో ఏడాది కాలంలో 8వ సారి ఆపరేషన్ కమల్ నిర్వహిస్తుందని చెప్పవచ్చు.

   

Tags:    

Similar News