ఏపీ బీజేపీలో చంద్రబాబు ఫ్యాన్సుపై ఫోకస్

Update: 2018-02-11 05:11 GMT
కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందంటూ మిత్రపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు - ఆ పార్టీ ఎంపీలు నిరసనలు తీవ్రం చేస్తుండడంతో బీజేపీ డిఫెన్సులో పడిందన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. కానీ.. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే కేంద్రానిది డిఫెన్సు కాదని... చంద్రబాబును అన్ని వైపుల నుంచి అటాక్ చేయడానికి సిద్ధమవుతోందని అర్థమవుతోంది. అంతేకాదు.. తమ పార్టీలో చంద్రబాబు అంటే ఇష్టపడే - ఆయన కోసం పనిచేసే సీనియర్ నేతలను కూడా దారిలో పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు - విశాఖ ఎంపీ అయిన హరిబాబుతో దిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించి కేంద్రం ఏపీకి ఏమేం ఇచ్చిందో చెప్పించినట్లు తెలుస్తోంది.
    
టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్న క్రమంలో బీజేపీ ఎంపీలు అందుకు కౌంటర్ గా కేంద్రం ఇచ్చిన నిధులు చెప్పాలని.. అది కూడా చంద్రబాబు అనుకూలుడిగా పేరున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు నేతృత్వంలో జరగాలని ఏపీ బీజేపీలోని ఇతర నేతలు సూచించిన మేరకే అధిష్ఠానం ఈ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది.
    
ఏపీలో ఏం జరుగుతున్నా కేంద్రం వద్ద చంద్రబాబు పట్ల సానుకూలత ఏర్పరచడంలో హరిబాబు - వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించేవారని అంటారు. అయితే... ఇప్పుడు వెంకయ్య ఉప రాష్ట్రపతి  కావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు హరిబాబును కూడా అదిలిస్తుండడంతో చంద్రబాబుకు ఏపీ బీజేపీలో ఇంకెవరూ అండగా కనిపించడం లేదు. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా చంద్రబాబుకు అనుకూలుడే అయినా కేంద్రంలో అంతగా చక్రం తిప్పే సామర్థ్యం ఆయనకు లేదు. పార్టీ సీనియర్‌ గా - అధ్యక్షుడిగా హరిబాబు అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా చంద్రబాబుకు కౌంటర్లేయాల్సి వస్తోంది. మొత్తానికి వ్యవహారం చూస్తుంటే చంద్రబాబుకు ఏపీ బీజేపీలో పట్టు తగ్గిపోయిందని తెలుస్తోంది.
Tags:    

Similar News