ప‌వ‌న్ నిర్ణ‌యంతో ఇర‌కాటంలో బీజేపీ, టీడీపీ

Update: 2021-10-03 15:03 GMT
బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించిన ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌సారిగా బాంబు పేల్చారు. నిన్న‌టి వ‌ర‌కూ సీఎం జ‌గ‌న్‌పై అధికార పార్టీపై నిప్పులు చెరిగి.. యుద్ధానికి సిద్ధ‌మా అంటూ స‌వాళ్లు విసిరిన ప‌వ‌న్ ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా బ‌ద్వేలు ఉప ఎన్నిక నుంచి త‌ప్పుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న నిర్ణ‌యంతో ప‌వ‌న్‌.. మిత్ర ప‌క్షం బీజేపీతో పాటు తెలుగు దేశం పార్టీని ఇర‌కాటంలో పెట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య మ‌ర‌ణంతో క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు శాస‌న స‌భ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. కరోనా కార‌ణంగా ఇన్ని రోజులు ఈ ఉప ఎన్నిక‌ను వాయిదా వేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 30న అక్క‌డ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ ఎన్నిక‌లో వైసీపీ త‌ర‌పున వెంక‌ట‌సుబ్బ‌య్య భార్య డాక్ట‌ర్ సుధ బరిలో దిగుతుంది. అక్క‌డ అధికార పార్టీకి పోటీనివ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న టీడీపీ త‌మ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌ని ఎంపిక చేసింది. మ‌రోవైపు పొత్తులో సాగుతున్న జ‌న‌సేన‌, బీజేపీ ఎవ‌రిని నిల‌బెడుతుంద‌నే ఆస‌క్తి క‌లిగింది. ఇటీవ‌ల విజ‌య‌వాడలో పార్టీ విస్త్రత‌స్థాయి సమావేశంలో బ‌ద్వేలులో క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌పై ప‌వ‌న్ ఆరా తీశారు. ఆ త‌ర్వాత అక్క‌డ పోటీపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుతోనూ చ‌ర్చ‌లు జ‌రిపారు. పొత్తులో భాగంగా అక్క‌డ పోటీచేసే అవ‌కాశం జ‌న‌సేన‌కు వ‌చ్చింది.

కానీ ఇప్పుడు ఉప ఎన్నిక‌లో పోటీ చేయాల‌నే ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ విలువ‌ల కోసం త‌ప్పుకుంటున్నామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. చ‌నిపోయిన వ్య‌క్తి స‌తీమ‌ణికి గౌర‌వ‌మిస్తూ పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని కూడా కోరారు. ఇప్పుడు ఆయ‌న నిర్ణ‌యంతో బీజేపీ, టీడీపీ ఇర‌కాటంలో ప‌డ్డాయి. జ‌న‌సేన త‌ప్పుకుంది కాబ‌ట్టి ఇప్పుడు అక్క‌డ బీజేపీ అభ్య‌ర్థిని నిల‌బెడుతుందా? ఒక‌వేళ అలా చేస్తే వైసీపీ అభ్య‌ర్థిపై గౌర‌వం మాన‌వ‌త్వం లేద‌ని భావించాలా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ ఉప ఎన్నిక‌పై ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేసి ఉంటే రెండు పార్టీల‌కు గౌర‌వం ఉండేద‌ని ఇప్పుడు ప‌వ‌న్ ఇలా సొంతంగా ప్ర‌క‌ట‌న చేయ‌డం బీజేపీకి న‌చ్చ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎవ‌రైనా ప్ర‌జాప్ర‌తినిధి ప‌ద‌విలో ఉన్న‌పుడు చ‌నిపోతే వాళ్ల కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిని ఏక‌గ్రీవంగా ఎన్నుకునే సంప్ర‌దాయం కొన్నేళ్లుగా రాజ‌కీయాల్లో సాగుతోంది.  కానీ నంద్యాల ఉప ఎన్నిక‌తో దీనికి బ్రేక్ పడింది. వైసీపీ త‌ర‌పున గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో వ‌చ్చిన ఆ ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌మ అభ్య‌ర్థిని నిలబెట్టింది. ఇక తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి ఉప ఎన్నిక‌లోనూ దివంగ‌త ఎంపీ దుర్గాప్ర‌సాద్ కుటుంబానికి కాకుండా గురుమూర్తికి టికెట్ ఇవ్వ‌డంతో అన్ని పార్టీలో పోటీ చేశాయి. ఇప్పుడు బ‌ద్వేలులో చ‌నిపోయిన ఎమ్మెల్యే భార్య పోటీలో ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ కూడా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. కానీ తాజాగా ఏక‌గ్రీవం అయేలా చూడాల‌న్న ప‌వ‌న్ కోరిక మేర‌కు టీడీపీ త‌ప్పుకుంటుందా? లేదా గెల‌వ‌లేమ‌ని తెలిసిన‌ప్ప‌టికీ వైసీపీకి పోటీ ఇవ్వాల‌నే ఉద్దేశంతో బ‌రిలో నిలుస్తుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. వైసీపీ త‌ర‌పున ఎవ‌రైనా అడిగితే వెన‌క్కి త‌గ్గేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ ఉప ఎన్నిక కోసం వైసీపీనే ఉత్సాహం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News