రాహుల్ షర్టు..మోడీ సూటు..దేశం దారెటు?

Update: 2022-09-09 14:41 GMT
‘భారత్ జోడో యాత్ర’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, రాహుల్ యాత్రపై బీజేపీ నేతలు విమర్శలు మొదలెట్టారు. రాహుల్ యాత్ర గురించో, కాంగ్రెస్ విధానల గురించో, పార్టీ గురించో విమర్శించడం మానేసిన బీజేపీ నేతలు...చివరకు ఆయన వేసుకున్న టీషర్ట్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

పాదయాత్రలో రాహుల్ ధరించిన వైట్ టీషర్ట్ చాలా ఖరీదైనదని, రాహుల్ చాలా విలాసవంతమైన జీవితం గడిపే వారని చెప్పాలన్న ఉద్దేశంతో కామెంట్లు చేశారు. భారత్ దేఖో అంటూ రాహుల్ టీషర్ట్ బ్రాండ్, ధర వెల్లడిస్తూ బీజేపీ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ లో ట్వీట్ చేశారు. బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందిన ఈ టీ షర్ట్ ధర రూ.41,000 అంటూ బీజేపీ సోషల్ మీడియా చేసిన ట్వీట్ వైరల్ అయింది.

ఈ క్రమంలోనే బీజేపీ ట్వీట్ పై కాంగ్రెస్ కూడా అంతే దీటుగా స్పందించింది. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ భయపడుతోందని విమర్శించింది. అంతేకాదు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల గురించి మాట్లాడాలని హితవు పలికింది. దుస్తుల గురించే చర్చించాల్సి వస్తే మోదీ రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల కళ్లద్దాల గురించి కూడా మాట్లాడుదామంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇక, ఈ ట్వీట్ వార్ నేపథ్యంలో బీజేపీలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

బీజేపీకి చెందిన చిన్నస్థాయి కార్యకర్తలు చేయాల్సిన ట్వీట్ ను బీజేపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడం ఏమిటని, బీజేపీ ఈ స్థాయి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీకి ఆ టీషర్ట్ పైనే చర్చ కావాలని, రాహుల్ లేవనెత్తిన సమస్యలపై చర్చ వద్దని నిలదీస్తున్నారు. గతంలో మోడీ ఖరీదైన సూటు, కళ్లజోడు ధరించి...బాడీగార్డులను పక్కకు నెట్టి మరీ ఫోజులిస్తున్న ఫొటోలను పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు.

బీజేపీ భావదారిద్ర్యం ఈ రేంజ్ కు పడిపోయిందని, టీ షర్ట్ వంటి అంశాలను కూడా హైలైట్ చేయడం ఏమిటని కొందరు బీజేపీ సానుభూతిపరుల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ షర్టు..మోడీ సూటు..దేశం దారెటు? అంటూ కొందరు ఇరు పార్టీల వైఖరిని తప్పుబడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News