వివరాలు చెబితే 107... చెప్పకపోతే 137!

Update: 2016-12-27 04:45 GMT

నల్లకుబేరులపై కఠినచర్యల విషయంలో రోజు రోజుకీ డోసుపెంచుకుంటూ వెళ్తుంది ఆదాయ పన్ను విభాగం. మొదట్లో స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం, అనంతరం నోట్ల రద్ధు, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన 2016 ఇలా నల్లబాబులకు ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్లిన అనంతరం ఇప్పటికీ లొంగని నల్లబాబుల పని పట్టేందుకు ఐటీశాఖ వారిపై తీసుకోబోయే కఠిన చర్యల వివరాలు ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం తనిఖీలు చేసినప్పుడు సరైన వివరాలు ఇవ్వకపోతే ఒక రకం పన్ను - వివరాలు చెబితే మరోరకం పన్ను విధించేందుకు సిద్దమైంది. అయితే ఈ రెండు పన్నులూ 100శాతానికి మించి ఉండటం గమనార్హం.

తనిఖీలు చేసినప్పుడు లెక్కల్లో చూపించని ఆస్తులకు - ఆదాయలకు సంబంధించి సరైన వివరాలు ఇవ్వలేని పక్షంలో వారి నుంచి 137 శాతం దాకా పన్నులు - జరిమానాలు విధించనున్నట్లు ఐటీ శాఖ హెచ్చరించింది. దీనిలో 60 శాతం పన్ను - 60 శాతం పెనాల్టీ - 15 శాతం సర్‌ చార్జీ - 3 శాతం విద్యా సెస్సు సర్‌ చార్జీ.. ఇలా మొత్తంగా 137.25 శాతం మేర కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా తనిఖీ సమయంలో లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు ఒప్పుకోవడంతోపాటు దానికి సంబంధించి సరైన వివరణ ఇచ్చినవారికి 107.25 శాతం వరకూ పన్నులు ఉండగలవని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో 60 శాతం పన్ను - 30 శాతం పెనాల్టీ - 15 శాతం సర్‌ చార్జి కాగా.. మిగిలిన 3 శాతం విద్యా సెస్సు సర్‌ చార్జ్‌.. మొత్తం కలిపి 107.25 శాతం కట్టాల్సి వస్తుంది. ఈ మేరకు ట్యాక్సేషన్‌ చట్టాలను సవరించినట్లు ఐటీ శాఖ తాజాగా పేర్కొంది.

కాగా గతంలో పన్నులు కట్టని మొత్తాలను ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన 2016 పథకం కింద నిర్దిష్ట పన్నులు చెల్లించడం ద్వారా ఊరట పొందవచ్చన్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 17న ప్రవేశపెట్టిన ఈ పథకం 2017 మార్చి 31దాకా అమల్లో ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News