బీఫ్ తిన్నందుకే ఉసేన్ బోల్ట్ కు గోల్డ్!

Update: 2016-08-29 08:30 GMT
ఈ మధ్యకాలంలో మన రాజకీయ నాయకుల చాలా మాటలు విమర్శలకు దారితీస్తున్నాయి. అనాలోచితంగా చేస్తారో, అధికంగా ఆలోచించడం వల్లే చేస్తారో తెలియదు కానీ.. ముఖ్యంగా కొంతమంది బీజేపీ ఎంపీలు, నాయకులు రకరకాల వ్యాఖ్యలు చేయడం.. అనంతరం మీడియా వక్రీకరించిందనో, తప్పుగా అర్ధం చేసుకున్నారనో వివరణలు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది! తాజాగా జమైకా చిరుత - ఉసెన్ బోల్ట్ కు బంగారు పథకం ఎందుకువచ్చిందో చెప్పే ప్రయత్నం చేసి వివాదాస్పదమయ్యారు బీజేపీ ఎంపి.

జమైకా చిరుత - ఒలంపిక్ మెడలిస్ట్ ఉసేన్ బోల్ట్‌‌ కు బంగారు పథకాలు రావడానికి గొడ్డుమాంసమే కారణమని సెలవిచ్చారు బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్. ఇప్పటికే గోసంరక్షణ అని, గోమాంసం వద్దని బీజేపీ నేతలు - బీజేపీ అనుకూల సంస్థలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. బోల్ట్ చాలా పేద కుటుంబంలో పుట్టాడని, రోజుకు రెండుసార్లు గొడ్డు మాసం తిన్నాడని, ఫలితంగా ఒలంపిక్స్‌ లో 9 స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడని ఉదిత్ రాజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో.. గొడ్డుమాంసం తింటేనే పతకాలు వస్తాయన్న కోణంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల వాన చినికి చినికి గాలివానగా మారుతుండటంతో.. వెంటనే తేరుకున్న ఉదిత్ వివరణ ఇచ్చుకున్నారు.

జమైకాలో ఉన్న పేదరికం - కనీస వసతుల లేమిని ప్రస్తావిస్తూ - అంతటి పేదరికంలో కూడా కఠోరంగా శ్రమించిన బోల్ట్ 9 గోల్డ్ మెడల్స్ సాధించారని తాను చెప్పానని, మన ఆటగాళ్లు కూడా కష్టపడితే విజయాలు సుసాధ్యమని చెప్పడమే తన ఉద్దేశమని.. తన వ్యాఖ్యలను బీఫ్ తినమని చెప్పినట్టుగా అర్థం చేసుకోరాదని వివరణ ఇచ్చారు. బోల్ట్‌ కు అతని ట్రైనర్ ఇచ్చిన సలహాను మాత్రమే తాను ప్రస్తావించానని వరుస ట్వీట్లలో ఆయన వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News