శని సింగనాపూర్‌ లో స్త్రీలకూ ప్రవేశం

Update: 2016-03-31 06:22 GMT
వివాదాస్పద శని సింగనాపూర్ ఆలయ ప్రవేశం విషయంలో మహిళలకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు చెప్పింది. పురుషులకు ప్రవేశమున్న ప్రతి ప్రదేశంలోనూ అడుగు పెట్టే హక్కు మహిళలకు ఉందని, ఏ చట్టమూ వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధించలేదని ముంబై హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. వివాదాస్పదంగా మారిన మహారాష్ట్రలోని శనిసింగనాపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశానికి న్యాయస్థానం అనుమతించింది. శనిసింగనాపూర్‌ తో పాటు ప్రతి ఆలయంలోకి వారు వెళ్ల వచ్చని దీనిని అడ్డుకున్న వ్యక్తులకు మహారాష్ట్ర చట్టం ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. అహ్మదాబాద్‌ జిల్లాలోని శనిసింగనాపూర్‌ ఆలయంలోకి మహిళలను అనుమతించక పోవడాన్ని సవాల్‌ చేస్తూ సీనియర్‌ న్యాయవాది నీలిమా వర్తాక్‌ - ఉద్యమ కార్యకర్త విద్యా బాల్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముంబాయి హైకోర్టు ప్రధానన్యాయమూర్తి డిహెచ్‌ వాఘేలా - జస్టిస్‌ ఎంఎస్‌ సోనాక్‌ లు ఈ వ్యాజ్యాన్ని విచారించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి వాఘేలా మహారాష్ట్ర ప్రభు త్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు వెళ్లి దేవుడి ముందు ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు మహిళలకు మాత్రం ఎందుకు అనుమతి లేదని ప్రశ్నించారు. మహిళల హక్కులను కాపాడాల్సిన భార రాష్ట్ర ప్రభుత్వంపై లేదా అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం 1956లో చేసిన చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా ఆలయంలోకి ప్రవేశించడాన్ని అడ్డుకుంటే వారు స్త్రీలైనా - పురుషులైనా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిం చారు. ఈ చట్టంపై ప్రభుత్వం ప్రతి విభాగానికి ఉత్తర్వులు జారీ చేయాలని, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించింది. ఏప్రిల్‌ 1వ తేదీ శుక్రవారానికి మహిళలు ఆలయంలో ప్రవేశించే విధంగా నిబంధనలు రూపొందిస్తూ ప్రకటన చేయాలని ప్రభుత్వ న్యాయవాది అభినందన్‌ వాగ్యానీని ఆదేశించింది. ఈ పిటిషన్‌ లో మహిళలు కేవలం గుడిలోకి మాత్రమే కాకుండా గర్భగుడిలోకి కూడా మహిళ లను అనుమతించాలని పేర్కొన్నారు. మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అర్థ రహితం - చట్టవిరుద్ధం - మహిళల ప్రాథమిక హక్కు లకు భంగం కలిగించడమేనని పిటిషన్‌ దార్లు పేర్కొన్నారు.
Tags:    

Similar News