తండ్రీ కూతురూ ఇద్దరూ డిప్యూటీలే

Update: 2022-09-20 02:30 GMT
అవును తమాషాలు ఎక్కడో జరగవు. మన చుట్టూనే జరుగుతాయి. మరీ ముఖ్యంగా  రాజకీయాల్లో జరిగినన్ని తమాషాలు ఎక్కడా చూడలేరు. సడెన్ గా ఒకరు ఉన్నత పదవిలో కూర్చోవచ్చు. మరొకరు ఆ పదవి నుంచి దిగిపోవచ్చు. నిన్నటి దాకా శిలనైనా అని పాడుకుంటూ ఉన్న వారు అద్భుతమైన శిల్పం అయిపోవచ్చు. ఇక ఒకే ఇంట్లో పదవులు అందుకున్న వారూ ఉన్నారు. ఒకేసారి అదేఇంట్లో ఓడి వేసారిన వారూ ఉన్నారు.

ఇదిలా ఉంటే విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి  కుటుంబానికి మంచి పేరు ఉంది. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనది మూడు దశాబ్దాల పై చిలుకు రాజకీయం. ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషిగా ఆ రాజకీయంతోనే ఎంట్రీ ఇచ్చినా కాంగ్రెస్ నుంచి ఏనాడూ ఎమ్మెల్యే కాకపోవడం ఒక చిత్ర విచిత్రం. ఆయన 1989లో తొలిసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అప్పటి టీడీపీ మినిష్టర్  అశోక్ గజపతిరాజు చేతిలో ఓడారు.

అయితే అదే మినిష్టర్ హోదాలో ఉన్న  అశోక్ మీద 2004లో ఇండిపెండెంట్ గా గెలిచి జెయింట్ కిల్లార్ అయ్యారు.  చెల్లు కూడా చేసేసారు. ఇది ఒక రికార్డు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున నిలబెట్టిన అభ్యర్ధి ఓటమి పాలు అయ్యారు. వైఎసార్ వేవ్ బలంగా ఉన్న 2004లో ఇండిపెండెంట్ గా కోలగట్ల గెలవడం చిత్రమే. ఆయనకు టికెట్ రాకుండా నాడు చక్రం తిప్పింది నేడు ఆ జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అని అంటారు. అయితే వైఎస్సార్ మాత్రం ఆయన్ని ఎన్నడూ ఇండిపెండెంట్ గా చూడలేదు. కాంగ్రెస్ మెంబర్ గా చూశారు. ఇక 2009 ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామి ఓడారు.

అయితే వైఎస్సార్ ఆయనకు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ పదవిలో ఉండగానే వైఎస్సార్ మరణంతో జగన్ వైపు వచ్చారు. అలా విజయన‌గరం జిల్లా నుంచి జగన్ పార్టీలో చేరిన తొట్టతొలి నాయకుడు ఆయన. అందుకే ఆ అభిమానంతో తన కోసం ఎమ్మెల్సీ వదులుకున్నారన్న దాంతో జగన్ ఆయనకు వైసీపీ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక 2018లో విజయనగరం పాదయాత్ర టైం లో విజయనగరం జిల్లాలో ఎందరో ఉద్ధండులు ఉండగా ఫస్ట్ టికెట్ కోలగట్లకే ప్రకటించి అందరికీ షాక్ తినిపించారు.

ఇక 2019 ఎన్నికల్లో కోలగట్ల రెండవసారి ఎమ్మెల్యేగా    వైసీపీ టికెట్ మీద గెలిచారు అయితే  ఓడించింది అశోక్ గజపతిరాజు కుమార్తె అతిది గజపతిరాజును. ఆ విధంగా తండ్రీ కూతుళ్ళను ఒకే సీట్లో ఓడించిన ఘనతను ఆయన సాధించారు. ఇక వైసీపీ గెలిచిన తరువాత మంత్రిగా ఆయనకే అవకాశం అనుకున్నారు కానీ సామాజిక సమీకరణల్తో బొత్సకు ఆ పదవి దక్కింది. దాంతో కోలగట్లకు రెండవ విడత హామీ ఉండేది. కానీ బొత్సనే కంటిన్యూ చేయడంతో చివరికి ఆయనకు క్యాబినేట్ ర్యాంక్ కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవిని జగన్ ఇచ్చారు. మొత్తానికి ఏదో ఒక విధంగా పదవి అయితే కోలగట్ల అందుకున్నారు.

ఇక కోలగట్ల ఇంట్లో రాజకీయ వారసత్వం ఉంది. ఆయన కుమార్తె కోలగట్ల శ్రావణి కూడా విజయనగరం కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్. నిజానికి ఆమె మేయర్ సీటే అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణలతో డిప్యూటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో కోలగట్ల కానీ ఆయన కుమార్తె శ్రావణి కానీ మరోసారి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆర్య వైశ్యులకు కొన్ని సీట్లు ఇవ్వాలని భావిస్తున్న నేపధ్యంలో విజయనగరంలో గట్టిగా ఉన్న కోలగట్ల ఫ్యామిలీకే టికెట్ అని అంటున్నారు. దానికి సాక్ష్యమే  ఈ డిప్యూటీ స్పీకర్ పదవి అని చెబుతున్నారు. మొత్తానికి కోలగట్ల వారి కుటుంబంలో ఇపుడు ఇద్దరొ డిప్యూటీలు ఉన్నారని అంతా అంటున్నారు. నిజానికి ఇది కూడా మరో రికార్డు. అలా కోలగట్ల వారి పొలిటికల్ లైఫ్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News