బీఆర్ఎస్ పై తేల్చేసిన బొత్స.. ఆ మాటలో నిజమెంత?

Update: 2022-10-06 11:36 GMT
మాటలదేముంది.. నరం లేని నాలుక ఎన్ని మాటలైనా చెబుతుంది. నలుగురి ముందు.. అందునా మీడియా ముందు చెప్పే మాటలకు.. తెర వెనుక చెప్పే విషయాలకు అస్సలు సంబంధమే ఉండదు. అందరితో పాటు ఏపీ మంత్రి.. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తి బాబును.. కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ గురించి స్పందించమని అడగటం.. ఆయన చెప్పేయటం జరిగిపోయాయి. భారత రాష్ట్రీయ పార్టీపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి వేళ.. ఏపీ అధికారపక్షానికి చెందిన బొత్స మాటల పైనా ఆసక్తి వ్యక్తమైంది. ఇంతకూ ఆయనేం చెప్పారన్నది చూస్తే.. ''తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రపతిగా మార్చటం వాళ్ల ఇష్టం. ఏపీలో ఉన్న పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అవుతుందంతే. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిది. మాపై బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏమీ ఉండదు'' అంటూ ధీమా మాటలు చెప్పారు. నిజంగానే.. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదా? అంటే.. ఎందుకు ఉండదనే మాటను రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అందుకు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో తన బంగారు పుట్టలో వేలు పెట్టే ప్రయత్నం చేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇచ్చే క్రమంలో కేసీఆర్ వేసిన ఎత్తులు.. ఆ సందర్భంగా టీడీపీకి ఎదురైన తలనొప్పుల గురించి తెలిసిన వారెవరూ బొత్స మాటల్ని పట్టించుకోరని చెబుతున్నారు. విషయం బొత్స చెప్పినంత సింఫుల్ గా ఉండదని చెబుతున్నారు.

2019లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి పరోక్షంగా కేసీఆర్ చేసిన సహాయ సహకారాల గురించి మర్చిపోకూడదు. ఏపీకి చెందిన ఎంతో మంది రాజకీయ నేతలకు హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు.. వాటికి సంబంధించిన లెక్కలు తెలిసిందే. అలాంటి వారిని ఎప్పుడెలా కంట్రోల్ చేయాలన్న విషయాన్ని మాటల్లో చెప్పకుండా.. చేతల్లో చూపించిన వైనం ఆ ఎన్నికల్లో ప్రభావాన్ని ప్రదర్శించిందన్నది మర్చిపోకూడదు.

ఏపీలో ఉన్న పార్టీలకు బీఆర్ఎస్ మరో పార్టీగా తేల్చేయటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదన్న మాటలో అర్థం లేదంటున్నారు. బీఆర్ఎస్ ప్రభావం తప్పనిసరి అన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. అలా అని ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు లాంటి ఆలోచనలు అతిశయమని చెప్పాలి.

కాకుంటే.. ఏపీలో అధికారపక్షంగా అవతరించే పార్టీకి వెన్నుదన్ను అందించే విషయంలో మాత్రం బీఆర్ఎస్ కీ రోల్ పోషిస్తుందని మాత్రం చెప్పక తప్పదు. తాను చెప్పినంత సింఫుల్ గా విషయం ఉండదన్న విషయం బొత్సకు తెలియంది కాదు. అయినా కూడా అలా మాట్లాటమే అసలుసిసలు రాజకీయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News