చైనా ఐటెమ్స్ బాయ్ కాట్ కి అంత సీన్ లేదంట

Update: 2016-10-14 07:56 GMT
గడిచిన కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక అంశంపై ప్రచారం జోరుగా సాగుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో తమపై అణుబాంబు దాడి చేసిన అమెరికాకు సంబంధించిన ఏ వస్తువును ఏ జపనీయుడు కొనడని.. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ వైరల్ కావటం తెలిసిందే. ఇప్పటికీ మేడిన్ అమెరికా అన్న ట్యాగ్ కనిపిస్తే చాలు.. అది గుండు సూది అయినా జపనీయుడు కొనే చాన్స్ లేదని.. మనమీద యుద్దానికి దిగిన చైనాను మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఆ దేశ ఉత్పత్తుల్ని మనం ఎందుకు కొనాలి? అంటూ ఓ పెద్ద ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది.

ఇదే తరహాలో ఈ దీపావళికి చైనా క్రాకర్స్ కాల్చొద్దని.. ప్రమాదకరమైన రసాయనాలతో క్రాకర్స్ ను తయారు చేశారన్న పోస్టింగ్స్ తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మొత్తంగా చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని.. ఎవరూ వాడొద్దంటూ భారత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారంపై చైనా అధికారిక మీడియా సంస్థ స్పందించింది.

ఇలాంటి బాయ్ కాట్ పిలుపులు విజయవంతం అయ్యే అవకాశమే లేదని తేల్చిన సదరు మీడియా సంస్థ.. భారత సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని తాము సీరియస్ గా తీసుకోవటం లేదని తేల్చేసింది. తమ దేశ ఉత్పత్తుల్ని నిషేధించాలని భారత ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని.. భారత దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ తమ దేశ ఉత్పత్తులు భారీగా అమ్ముడవుతున్నట్లుగా పేర్కొంది.

నేటికీ భారత్ లో అమ్ముడయ్యే వస్తువుల్లో చైనా ఉత్పత్తులే ఎక్కువని.. అక్టోబరు మొదటి వారంలో అమెజాన్.. ప్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లలో చైనా ఉత్పత్తులే ఎక్కువగా అమ్ముడైనట్లు పేర్కొన్నారు. చైనాకు చెందిన షియోమీ మొబైల్ ఫోన్లు అయితే మూడు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు లక్షల ఫోన్ సెట్లు అమ్ముడైన విషయాన్ని ప్రస్తావించింది. 2014లో పోలిస్తే 2015లో భారత్ లో చైనా పెట్టుబడులు ఆరురెట్లు పెరిగిన విషయాన్ని సదరు మీడియా సంస్థ పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News