షాకిచ్చిన బ్రహ్మానందం.. ఇలా చేస్తాడనుకోలేదు

Update: 2019-12-01 05:36 GMT
కర్ణాటకలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చి బీజేపీ గద్దెనెక్కింది. ఈ క్రమంలోనే 17మంది ఎమ్మెల్యేలు సీఎం కుమారస్వామికి వ్యతిరేకంగా ఫిరాయించడంతో కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆ 17మందిలో 15 మంది స్థానాలకు ఉప ఎన్నికలు ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్నాయి.. గెలుపోటములపై జోరుగా అప్పుడే బెట్టింగ్ లు కాస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపోటములతో కన్నడలో బీజేపీ సర్కారు ఉంటుందా కూలుతుందా అనేది తేలనుంది.

 ఈ ఎన్నికలకు రోజులు దగ్గరపడ్డాయి. ఈనెల 5న పోలింగ్. 3వ తేదీ వరకూ ప్రచారానికి ముగింపు. దీంతో తమ అస్త్రశస్త్రాలన్నింటిని ప్రయోగిస్తున్నాయి కన్నడ పార్టీలు. ప్రధానంగా అధికార బీజేపీకి - కాంగ్రెస్-జేడీఎస్ కు మధ్య పోరు హోరాహోరీగా ఉంది.

బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను సీఎం యడ్యూరప్ప తీసుకున్నారు. సీఎం యడ్డీ బెంగళూరులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేస్తున్నారు. ఇక జేడీఎస్ అధినేత దెవె గౌడ చిక్క బళ్లాపురంలో ప్రచారం చేస్తున్నారు.

కాగా ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం అశ్చర్యకరంగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. 

ఏపీలోని ఎన్నికల్లో అస్సలు తలదూర్చని బ్రహ్మానందం ఇలా కర్ణాటకలో మాత్రం ఏకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. బ్రహ్మానందం బీజేపీ తరుఫున శనివారం చిక్కబళ్లాపురంలో రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉండడంతో ఆయనను బీజేపీ బరిలోకి దించినట్టు తెలుస్తోంది. బ్రహ్మీని చూడడానికి  పెద్ద సంఖ్యలో జనం ఎగబడుతున్నారు.


Tags:    

Similar News