జగన్ ను బాబు అంతలా అవమానించారా?

Update: 2016-08-12 15:45 GMT
కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కావాలని కాకున్నా.. కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోకపోవటం కారణంగా జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూసేందుకు చిన్న విషయాలుగా కనిపించినా.. ప్రజల మనసుల్లో రిజిష్టర్ కావటంతో పాటు.. అధికారపక్ష పొగరుగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. ఇవి పెరిగే కొద్దీ అధికారపక్షంపై వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా షురూ అయిన కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా అవమానించారన్న వాదనను ఆ పార్టీ నేతలు తెర మీదకు తీసుకొచ్చారు.

పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానం పంపించి ప్రతిపక్ష నేతను దారుణంగా అవమానించారని ఆరోపిస్తున్నారు. పుష్కరాలకు ముందే సినిమా నటులకు ఆహ్వానం పంపిన చంద్రబాబు.. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకు ఆహ్వానం పంపాలని తెలీదా? అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ మొదలు మెగాస్టార్ వరకూ పేరు పేరునా పుష్కర ఆహ్వానం పంపిన చంద్రబాబు.. పుష్కరాలు ప్రారంభం అయ్యాక జగన్ కు ఇన్విటేషన్ పంపుతారా? అంటూ మాజీ మంత్రి పార్థసారథి ప్రశ్నిస్తున్నారు.

పుష్కరాలు చంద్రబాబు ఇంటి వ్యవహారం కాదని.. ఏపీ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. పుష్కర స్నానానికి వైఎస్ జగన్ హాజరు కాకపోవటంపై విమర్శలు వస్తున్న వేళ.. ఈ అంశంపై క్లారిటీ ఇస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. తొలుత పుష్కర స్నానం కోసం జగన్ ఏర్పాట్లు చేసుకున్నారని.. కానీ అనుకోని అవాంతరాలతో ఈ నెల 18న జగన్ పుష్కర స్నానం చేస్తారని చెబుతున్నారు.

ప్రతిపక్ష నేతను దారుణంగా అవమానించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నట్లుగా జగన్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ పార్టీ నేతలు ఆరోపించినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వ్యవహరించి ఉంటే తప్పు చేసినట్లే. ఇలాంటి వాటితో వచ్చే లాభం ఏమీ లేకున్నా.. నష్టం మాత్రం భారీగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఒకవేళ అలాంటిదేమీ జరగకుంటే ఏపీ అధికారపక్షం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News