'మహా' బ్రేకింగ్ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Update: 2019-11-12 10:11 GMT
గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభం తో కొట్టుమిట్టాడుతున్న మహారాష్ట్ర రాజకీయం గంటకొక మలుపు తిరుగుతూ ముందుసాగుతుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. దీనితో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి మహా రాజకీయం అనేక మలుపులు తిరుగుతుంది. బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అని అనుకున్న సమయంలో 50 -50 ఫార్ములాకి బీజేపీ ససేమిరా అనడంతో అసలు సమస్య వచ్చి పడింది. ఆ తరువాత శివసేన బీజేపీ నుండి బయటకి వచ్చి కాంగ్రెస్ , ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ తరుణంలోనే మహారాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని నిరూపించుకోలేని నేపథ్యంలో... గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ అనూహ్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపినట్టు తెలుస్తోంది. గవర్నర్ పంపిన సిపార్సుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు కోసం సోమవారం శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్‌.. నేడు (మంగళవారం) ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి రాత్రి 8.30 గంటలవరకు గడువు కూడా ఇచ్చారు. కానీ, గవర్నర్ ఇచ్చిన ఆ గడువు ముగియకముందే గవర్నర్‌ అనూహ్యంగా రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

గవర్నర్‌ నిర్ణయంతో షాక్‌ తిన్న శివసేన తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఎన్సీపీ కూడా గవర్నర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. ఒకవేళ గవర్నర్‌ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్‌ను సంప్రదించాలని నిర్ణయించింది. మరోవైపు శివసేనకు మద్దతిచ్చే విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్‌ మధ్య జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున్‌ ఖర్గే, అహ్మద్‌ పటేల్‌ ముంబై చేరుకున్నారు.  కాంగ్రెస్‌-ఎన్సీపీ కలిసి శివసేన కి మద్దతు ఇచ్చే విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారు.
Tags:    

Similar News