బాబు లాంటి తండ్రి వాళ్లకు అవ‌స‌రం లేద‌ట‌

Update: 2017-06-20 05:15 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఎం పొలిట్‌ బ్యూరో స‌భ్యురాలు ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఎఎఆర్‌ ఎం) ఉపాధ్యక్షురాలు బృందాకరత్  తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు విశాఖపట్నంలో ఆదివాసీల జాతీయ మహాసభలు జరుగుతున్న నేప‌థ్యంలో అరకులో గిరిజన గర్జన పేరుతో ర్యాలీ - బహిరంగసభ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా బృందాకార‌త్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లా పెదలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్నార‌ని అయితే నేటికీ ఆ గ్రామ గిరిజనులకు రక్షిత తాగునీరు - విద్య - వైద్యం వంటివేవీ అందుబాటులోకి రాలేదని బృందా చెప్పారు. దత్తత తీసుకోవడమంటే పిల్లలుగా చేసుకోవడమని, ఏ సదుపాయం కల్పించని చంద్రబాబు వంటి తండ్రి తమకు అక్కర్లేదని గిరిజనులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

గిరిజ‌నుల‌కు అట‌వీ భూముల‌పై ర‌క్ష‌ణ క‌లిగించే చ‌ట్టాన్ని చంద్ర‌బాబు ధ్వంసం చేస్తున్నారని బృందా కార‌త్  ఆరోపించారు. విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు జీవొ నెం.97 జారీ చేశారని, ఆ జీవోను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలపై స్థానిక గిరిజనులతో సంప్రదించకపోవడం దారుణమన్నారు. గిరిజనులకు వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వట్లేదని, ఉపాధి హామీ డబ్బులివ్వట్లేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇద్దరూ గిరిజనులకు ద్రోహం చేస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. బిజెపి - ఎన్‌ డిఎ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గిరిజనులకు ప్రజాస్వామ్యం లేదని బృందాకార‌త్‌  చెప్పారు. ఆదివాసీలకు చెందాల్సిన భూములను - సహజ వనరులను - అటవీ ఉత్పత్తులను కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లపరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఈ విధానాలకు వ్యతిరేకంగా గిరిజనులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు తమకు ప్రజాస్వామ్యం కావాలని అడుగుతుంటే పోలీసులు - భద్రతాదళాలను ప్రయోగించి పాశవిక నిర్భందాలతో ఉక్కుపాదంతో పాలకులు అణచివేస్తున్నారని బృందాకార‌త్  అన్నారు.

గిరిజనుల్లో నైపుణ్య అభివృద్ధికి గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేసే విషయంలో మోడీ - బాబు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని బృందాకార‌త్ విమర్శించారు. నైపుణ్య భారత్‌ అని మోడీ - నైపుణ్య ఆంధ్ర అని బాబు అంటున్నారు. ఏజెన్సీలో చదువుకున్న మహిళలు తక్కువ వేతనాలపై ఎఎన్‌ ఎంలు - ఆశా వర్కర్లు - అంగన్‌ వాడీలుగా వెట్టి చేస్తున్నారు. వారిని రెగ్యులరైజ్‌ చేయట్లేదు' అని బృందా ఆందోళన వ్యక్తం చేశారు.గిరిజన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించట్లేదన్నారు.  గిరిజన గర్జనకు వచ్చింది సమస్యలు మననం చేసుకొని రోదించడానికి కాదని, తమకు అన్యాయం చేస్తున్న కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రతిఘటించడానికై కార్యాచరణ రూపొందించుకోడానికని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News