బీఆర్‌ఎస్‌.. ఇలా అయితే కష్టమే!

Update: 2022-12-15 05:44 GMT
జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్రను పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇందుకోసం తన పార్టీ టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చారు. అయితే పార్టీ పేరును మార్చినంత సులువుగా బీఆర్‌ఎస్‌ విజయం సాధించడం కష్టమనే విషయం కేసీఆర్‌ కు తొలి రోజే అర్థమైందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ (భారత రాష్ట్ర సమితి) పేరుతో జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు కేసీఆర్‌ వచ్చారు. అయితే జాతీయ స్థాయిలో పేరున్న ఇతర పార్టీ నేతల్లో మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ యాదవ్‌ (సమాజ్‌ వాదీ పార్టీ), కుమారస్వామి (జనతాదళ్‌ సెక్యులర్‌) మినహా మరెవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం గమనార్హం. ఢిల్లీలోనే పరిపాలన సాగిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి ఒక్కరూ హాజరవలేదు.

ప్రధాని మోడీకి జాతీయ స్థాయిలో ఎదురునిలబడగల వ్యక్తినని తానేనని కేసీఆర్‌ చెప్పుకుంటున్నా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓవైపు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ ఇలా ఎంతో మంది అన్ని సమీకరణాలు కలిసివస్తే ప్రధాని పదవిని చేపట్టాలని సిద్ధంగా ఉన్నారు.

ఈ పార్టీలన్నీ టీఆర్‌ఎస్‌ కంటే పెద్దవి. ఎంపీ స్థానాలు కూడా తెలంగాణతో పోల్చితే ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ. ప్రస్తుతం లోక్‌ సభలో సైతం ఆయా పార్టీలకే ఎక్కువ మంది సభ్యులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ వచ్చి తన నాయకత్వంలో అందరూ నడవండి అంటే ఒక్కరూ నడవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.

ఇక జాతీయ మీడియా సైతం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ను లైట్‌ తీసుకుంది. ఏ ఆంగ్ల, హిందీ పత్రికలోనూ, న్యూస్‌ చానెల్స్‌ లోనూ బీఆర్‌ఎస్‌ కు మామూలు ప్రాధాన్యత కూడా లభించకపోవడం గమనార్హం. వాస్తవానికి జాతీయ మీడియాలో న్యూస్‌ 18, ఎన్డీటీవీ, రిపబ్లిక్‌ తదితర అన్నీ బీజేపీ అనుకూలంగానే కొనసాగుతున్నాయి. పెద్ద పత్రికలదీ సైతం ఇదే బాట. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కు ఆదిలోనే హంసపాదు ఎదురైందని చెప్పుకుంటున్నారు.

ఓవైపు పెద్దగా పేరున్న నేతలు బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాకపోవడం, ఇంకోవైపు జాతీయ మీడియాలో కనీస ప్రాధాన్యత కూడా లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు లోలోన ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో రాణించాలంటే మీడియా మద్దతు చాలా అవసరమని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నట్టు చెబుతున్నారు.

కాగా ఈ మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశమంతా తన ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలను అన్ని పత్రికలు, టీవీ చానెళ్లలో ఇచ్చినట్టే కే సీఆర్‌ సైతం తెలంగాణలో సంక్షేమ పథకాల గురించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాకు సంబంధించి ప్రధాన పత్రికలు, ప్రధాన న్యూస్‌ చానెళ్లు అన్నింటికీ కోట్లాది రూపాయలు విలువ చేసే యాడ్స్‌ ఇచ్చారు.

అయినా సరే ఆ జాతీయ పత్రికలు, టీవీ చాన్నెళ్లు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ను లైట్‌ తీసుకున్నాయి. కేవలం ఒక సాధారణ వార్తలానే బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటును ప్రసారం చేశాయి.. ప్రచురించాయి.

వాస్తవానికి మీడియా మద్దతు పార్టీకి ఎంత అవసరమో తెలియని వ్యక్తి కేసీఆర్‌ కాదు. అందుకోసమే ఇప్పటికే నార్త్‌ ఇండియాకు సంబంధించిన ఒక ప్రముఖ జర్నలిస్టును జాతీయ మీడియా వ్యవహారాలను పార్టీతో అనుసంధానం చేయడానికి పీఆర్వోగా నియమించారు. అయినా బీఆర్‌ఎస్‌ దేశ రాజధానిలో చేపట్టిన తొలి కార్యక్రమానికే సరైన మీడియా కవరేజ్‌ లేకుండా పోయిందని వార్తలు వచ్చాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News