బుద్దా...మ‌హిళా ఎమ్మెల్యేపై ఈ వ్యాఖ్య‌లేంటి?

Update: 2017-03-28 06:27 GMT
బుద్దా వెంక‌న్న‌... మొన్న‌టిదాకా బెజ‌వాడ‌లో ఓ చోటా మోటా నేత‌గా ఉన్న ఈ టీడీపీ నేత‌... 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత బ‌డా నేత‌గానే ఎదిగిపోయారు. బెజ‌వాడ‌లో టీడీపీని ఎవ‌రేమ‌న్నా... ఏమాత్రం స‌హించేది లేద‌న్న‌ట్లు అప్ప‌టిక‌ప్పుడే రంగంలోకి దిగే బుద్దా... త‌న నోటికి ప‌ని చెబుతారు. అంతేనా... అవ‌స‌ర‌మైతే ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌రుష ప‌ద‌జాలం వినియోగించ‌డ‌మే కాకుండా... ఆఖ‌రుకు చేయి చేసుకునేందుకు కూడా ఆయ‌న వెనుకాడ‌ర‌నే చెప్పాలి. మొన్న‌టికి మొన్న ఈ త‌ర‌హా ఘ‌ట‌నే ఆ న‌గ‌రంలో చోటుచేసుకుంది. ర‌వాణా శాఖ అధికారుల‌పై విరుచుకుప‌డేందుకు టీడీపీ సీనియ‌ర్ నేత‌ - విజ‌యవాడ ఎంపీ కేశినేని నాని - ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు బ‌య‌లుదేర‌గా... వారి వెంట రవాణా శాఖ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్య‌క్ష‌మైన బుద్ధా... ర‌వాణా శాఖ అధికారుల‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

కేశినేని ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం కాగా... త‌మ నేత‌ల వ‌ద్ద‌కు కాళ్ల బేరానికి రావాల్సిందేనంటూ బుద్ధా బెదిరింపుల‌కు దిగారు. ఇక బుద్దా వాద‌న‌తో కాస్తంత ఉద్రేకానికి లోనైన బొండా ఏకంగా అధికారిపై చేయి వేసి తోసేశారు. ఈ దృశ్యాలు మీడియాలో వైర‌ల్ కావ‌డం... నాని - బొండా - బుద్ధాల‌కు బాబు క్లాసు పీక‌డం - ఆ త‌ర్వాత ముగ్గురూ మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చి సారీ చెప్ప‌డం జ‌రిగిపోయింది. ఇది జ‌రిగి రెండు రోజులు కూడా పూర్తి కాలేదు... బుద్ధా మ‌రోమారు రంగంలోకి దిగిపోయారు. నేటి ఉద‌యం ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా వెల‌గ‌పూడి తాత్కాలిక అసెంబ్లీ వ‌ద్ద మీడియాతో మాట్లాడిన బుద్ధా... వైసీపీ ఎమ్మెల్యే - మ‌హిళా నేత అయిన ఆర్కే రోజాపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళా ఎమ్మెల్యే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బుద్ధా చెల‌రేగిపోయాడ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

అయినా రోజాపై బుద్ధా చేసిన వ్యాఖ్య‌లు ఏంటంటే...  రోజా నీతులు చెబుతుంటే, బూతులు చెబుతున్నట్టుగా ఉందని ఆయ‌న అన్నారు. చంద్రబాబు వంటి వ్యక్తిని రోజా ఏకవచనంతో పిలుస్తోందని, ఈ వైఖరి ఎంతమాత్రమూ తగదని ఆయ‌న ఫైర‌య్యారు. చంద్రబాబును శ్రీరాముడితో పోల్చిన బుద్ధా... రోజాను మాత్రం శూర్పణకతో పోల్చారు. రామాయణంలో శూర్ప‌ణ‌క‌ ముక్కూ చెవులను కోశారని, ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రోజా నాలుకను చీరేస్తారని కూడా బుద్ధా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మొన్న‌టి అదుపు త‌ప్పిన బుద్ధా ప్ర‌వ‌ర్త‌న‌పై ఫైర్ అయిన చంద్ర‌బాబు... మ‌హిళా ఎమ్మెల్యేపై ఆయ‌న కామెంట్ల‌పై ఏమంటారో?  చూడాలి.​


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News