జీరో బేస్డ్ వ్య‌వ‌సాయం.. మ‌ళ్లీ మూలాల‌కు రైత‌న్న‌

Update: 2019-07-05 09:26 GMT
తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2019-20 వార్షిక బ‌డ్జెట్లో రైత‌న్న‌ల‌కు పెద్ద‌పీట వేశారు. వ్య‌వ‌సాయ రుణాల‌ను పెంచారు. వ‌డ్డీల‌పై రాయితీ ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో జీరో ఆధారిత సాగును రాబోయే ఐదేళ్ల‌లో ప్రోత్స‌హిస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు దేశం మొత్తం.. కూడా ఏంటీ జీరో బేస్డ్ అగ్రిక‌ల్చ‌ర్ అనే విష‌యం దృష్టి పెట్టింది. నిజానికి ఈ విధానం మ‌న‌కు కొత్త‌కాదు. జీరో బ‌డ్జెట్ నేచుర‌ల్ ఫార్మింగ్‌(జెడ్ బీఎన్ ఎఫ్‌)గా పేర్కొనే ఈ విధానంలో రైతుల‌పై ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా - వారు పెట్టుబ‌డులు భారీ మొత్తంలో పెట్ట‌కుండా - సాదాసీదా ఖ‌ర్చుల‌తోనే ఈ సాగు విధానం ఉంటుంది.

కొన్ని ద‌శాబ్దాల కింద‌ట దేశంలో వ్య‌య ర‌హిత వ్య‌వ‌సాయంపై పెద్ద ఎత్తున ఉద్య‌మ‌మే సాగింది. త‌ర్వాత దేశం మొత్తం కూడా ఇవి విస్త‌రించింది. ప్ర‌ధానంగా దేశంలోని ద‌క్షిణాది రాష్ట్రాల రైతులు ఈ సాగు దిశ‌గా దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క‌లో రైతులు తొలిసారి వ్య‌య ర‌హిత సాగువైపు అడుగులు వేశారు. ఒకానొక ద‌శ‌లో దేశంలో క్షామం పెరిగిన స‌మ‌యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది. ఈ స‌మ‌యంలో క‌ర్ణాట‌క రైతులు ఎలాంటి పెట్టుబ‌డులు లేకుండానే సూక్ష స్థాయి క‌మ‌తాల‌ను ఏర్పాటు చేసుకుని - జీరో బేస్డ్ వ్య‌వ‌సాయం చేప‌ట్టారు. దీనిని విజ‌య‌వంతం చేశారు.

ప్ర‌స్తుత విధానంలో విత్త‌న కంపెనీల‌ను ప్రైవేటీ క‌రించ‌డం - అధిక ఉత్ప‌త్తి కోసం ఎరువులు - పురుగు మందుల వినియోగాన్ని పెంచ‌డం వ‌ల్ల వాటికి చేసే వ్య‌యం పెరిగి రైతులు తీవ్ర సంక్షోభంలో అల్లాడుతున్నారు. పెట్టుబ‌డికి - ఉత్ప‌త్తి అమ్మ‌కానికి మ‌ధ్య తీవ్ర‌మైన వ్య‌త్యాసం ఉండ‌డంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయి చివ‌ర‌కు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం వ‌చ్చే ఐదేళ్ల కాలంలో జీరో బేస్డ్ వ్య‌వ‌సాయాన్ని అమ‌లు చేయాల‌ని - రైతుల‌ను ఈ దిశ‌గా ప్రోత్స‌హించి శిక్ష‌ణ కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డంపై వ్య‌వ‌సాయ రంగంలో జోష్ పెరిగింది. వ్య‌య ర‌హిత వ్య‌వ‌సాయ విధానం అందుబాటులోకి వ‌స్తే.. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు కూడా దిగివ‌స్తాయ‌ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం భావిస్తోంది.

వ్యయ ర‌హిత వ్య‌వ‌సాయ విధానంలో రైతుల‌ను రుణాల‌పై ఆధార‌ప‌డ‌కుండా వ్య‌వ‌సాయం చేసే విధానాల‌ను నేర్పుతారు. అదే స‌మ‌యంలో ఉత్ప‌త్తి వ్య‌యాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తారు. అప్పుల సుడిగుండంలో రైతులు చిక్కుకోకుండా జాగ్ర‌త్త వ‌హిస్తారు. అదే స‌మ‌యంలో ఎలాంటి ర‌సాయనిక మందులు వినియోగించ‌కుండా సాగును చేసేలా శిక్ష‌ణ ఇస్తారు.  ఈ విదానం ఇప్ప‌టికే ద‌క్షిణాది స‌హా పంజాబ్‌లోనూ అమ‌లు చేస్తున్నారు. దీనిని విస్త‌రించ‌డం ద్వారారైతుల క‌ష్టాలు తీర్చ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపే ర‌సాయ‌నిక ప‌దార్ధాల వినియోగాన్ని కూడా త‌గ్గించిన వార‌వుతారు.


Tags:    

Similar News