ఎన్నికల వేళ.. కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండబోతోందంటే!

Update: 2023-01-03 11:30 GMT
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పార్లమెంటు సమావేశం కానుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి.

2023లో మొత్తం 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఎన్నికల బడ్జెట్‌ గానే ఉంటుందనే అంచనాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది జరగబోయే 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2024కి సెమీ ఫైనల్‌ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఎన్నికల బడ్జెట్‌ గానే ఉండబోతుందని అంటున్నారు.

ముఖ్యంగా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ లో పలు వరాలను ప్రకటిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే వేతన జీవుల ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.2.50 లక్షల వరకు సంపాదించే ఆదాయంపై పన్ను చెల్లించనవసరం లేదు. దీన్ని నిర్మల సీతారామన్‌ రూ.ఐదు లక్షలకు చేరుస్తారని వార్తలు వస్తున్నాయి. అంటే రూ.5 లక్షల ఆదాయం వరకు ఆదాయ పన్ను వసూలు చేయరు.

అలాగే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు సైతం భారీ కేటాయింపులు ఉంటాయని విశ్వసిస్తున్నారు. భారీ ఎత్తున బీజేపీ ప్రజల ఓట్లను కొల్లగొట్టేలా నిర్మల ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా వేతన జీవుల కోసం కీలక రాయితీలు, మినహాయింపులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వార్షిక ఆదాయం అయిదు లక్షల రూపాయల లోపు ఉన్న వారిని ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తారని వివరిస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్షాలు ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై తీవ్ర పోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంధన ధరలు, గ్యాస్‌ ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, జీఎస్టీ, రూపాయి విలువ పతనం వంటివాటిపై బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. అలాగే సరిహద్దుల్లో చైనాను అడ్డుకోలేకపోవడం, తదితర అంశాలపై అధికార పార్టీని ఇరుకునపెట్టేలా ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News