ప్ర‌జాస్వామ్యం సిగ్గు ప‌డింది.. లోక్ స‌భ నిర‌వ‌ధిక వాయిదా

Update: 2018-04-06 06:45 GMT
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. ఈ మాట చెప్పేందుకు ఎలాంటి మొహ‌మాటాల‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేదు. ఐదుకోట్ల ఆంధ్రుల క‌ల‌ల్ని ఇప్ప‌టికే స‌మాధి చేసిన మోడీ.. వారి ఆక్రోశాన్ని వినేందుకు సైతం త‌న‌కు ఎంత‌మాత్రం ఇష్టం లేద‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల ద్వారా తేల్చి చెప్పారు. ప్ర‌జాస్వామ్యం సిగ్గుప‌డేలా మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించింద‌న్న అపప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకునేందుకు వెనుకాడ‌లేదు. చ‌రిత్ర‌లో త‌న త‌ప్పును న‌మోదు అయ్యే అవ‌కాశాన్ని ఆయ‌న‌కు ఆయ‌నే క‌ల్పించుకున్నారు.

గుప్పెడు మంది ఎంపీలు లోక్ స‌భ‌ను కంట్రోల్ చేయ‌గ‌లిగారంటే.. అదంతా ఎవ‌రి మ‌హ‌త్య‌మో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్‌పై మోడీ స‌ర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌ను ఏ రోజుకు ఆ రోజు చ‌ర్చ‌కు రాకుండా చేయ‌ట‌మే కాదు.. స‌భ స‌జావుగా సాగ‌కుండా ఉండేలా అన్నాడీఎంకే ఎంపీలు వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టినా.. అది స‌భ‌లోకి చ‌ర్చ‌కు రాకుండా ఉండేందుకు మోడీ స‌ర్కారు ఫాలో అయిన వ్యూహం రానున్న రోజుల్లో మ‌రిన్ని అధికార‌ప‌క్షాల‌కు అస్త్రంగా మారుతుంద‌న‌టంలో ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదు. మొద‌ట్లో అన్నాడీఎంకే.. టీఆర్ ఎస్ ఎంపీల ఆందోళ‌న‌తో లోక్ స‌భ జ‌ర‌గ‌లేదు. చివ‌ర్లో అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు కొంద‌రు స్పీక‌ర్ పోడియం చుట్టూ చేరి.. స‌భ జ‌ర‌గ‌కుండా చేయ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే స్పీక‌ర్ స‌భ‌ను ఏ రోజుకు ఆ రోజు వాయిదా వేసుకుంటూ పోయి.. లోక్ స‌భ స‌మావేశాల చివ‌రి రోజైన ఈ రోజును అదే తీరులో ఫాలో కావ‌టం గ‌మ‌నార్హం.

గ‌డిచిన కొద్దిరోజుల మాదిరే ఈ రోజు ఉద‌యం (శుక్ర‌వారం) స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళ‌న చేస్తూ.. కావేరీ యాజ‌మాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. స‌భ ఆఖ‌రు రోజు కావ‌టంతో స‌భ్యులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని స్పీక‌ర్ కోరినా.. అన్నాడీఎంకే నేత‌లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర  ఎంపీలు సైతం ఏపీకి న్యాయం చేయాలంటూ ఆందోళ‌న చేయ‌టంతో స‌భ‌లో గంద‌ర‌గోళం చోటు చేసుకుంది.

ఇదే స‌మ‌యంలో తాజా స‌మావేశాలు ఎలా జ‌రిగాయ‌న్న అంశాన్ని స‌భ‌కు వివ‌రించారు. ఇదంతా జ‌రుగుతున్న‌ప్పుడు ప్ర‌ధాని మోడీ స‌భ‌లోనే ఉన్నారు. స‌మావేశాలు జ‌రిగిన తీరును ప్ర‌స్తావించిన స్పీక‌ర్ సుమిత్రా.. ఆ వెంట‌నే స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. దీంతో.. అవిశ్వాసం తీర్మానంపై ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే స‌భ వాయిదా ప‌డిన‌ట్లైంది. గ‌డిచిన కొన్ని రోజులుగా అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌గ‌కున్నా.. స‌మావేశాల చివ‌రి రోజున స‌భ జ‌రుగుతుంద‌ని.. అవిశ్వాసం బిల్లుపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని ఆశించారు. అందుకు భిన్నంగా అలాంటిదేమీ ర‌గ‌కుండానే స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది.

ఇదిలా ఉంటే.. స‌భ వాయిదా ప‌డ‌టంపై ఆంధ్ర  ఎంపీలు రియాక్ట్ అయ్యారు. స‌భ వాయిదా వేసిన  తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ప్ర‌ధాని మోడీ ఎదుట నిర‌స‌న చేపట్టారు. ఆంధ్ర  ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోన‌న్నట్లుగా.. ఎవ‌రి వంకా చూడ‌కుండానే త‌న సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. మోడీ తీరుపై ప‌లువురు తీవ్ర అభ్య‌త‌రం వ్య‌క్తం చేశారు.


Tags:    

Similar News