తెలంగాణ‌లో మామా అల్లుళ్ల జ‌ల‌దోపిడీనా?

Update: 2017-10-17 09:29 GMT
తెలంగాణ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ నేత‌లు ఓ రేంజ్‌ లో విరుచుకుప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ - ఆయ‌న మేన‌ల్లుడు - నీటిపారుద‌ల మంత్రి హ‌రీశ్‌ రావుల‌ను నీళ్ల దొంగ‌లుగా పేర్కొంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కుమ్మ‌రించారు. విష‌యంలోకి వెళ్తే.. డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ప్ర‌భుత్వంపై ఫైరైపోయారు. తపాసుపల్లి రిజర్వాయర్‌ ద్వారా  సీఎం కేసీఆర్ - మంత్రి హరీశ్‌ రావు జలదోపిడీకి పాల్ప డుతున్నారని  ఆరోపించారు. తపాసుపల్లి రిజార్వాయర్‌ నుంచి సిద్దిపేట జిల్లాకు నీటిని తరలిస్తున్న కాల్వను ఆయన సందర్శించారు. నీటి విడుద‌ల‌ - రాక‌పోక‌ల‌ను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. జనగామ - ఆలేరు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించేందుకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తపాసుపల్లి రిజర్వాయర్‌ ను 2004లో ప్రారంభించి 2013 వరకు పూర్తిచేసిందని తెలిపారు. రాజాపేట మండలంలోని పాలెంగండిలోకి తపాసుపల్లి రిజార్వాయర్‌ నీరు అందించేందుకు అప్పట్లో రూ.4.95కోట్లు నిధులు మంజూరు చేయించిన‌ట్టు తెలిపారు. నేటి ప్రభుత్వం ఆ ప్రణాళికను తుంగలో తొక్కిందన్నారు. తపాసుపల్లి ద్వారా ఆలేరుకు వచ్చే జలాలను మంత్రి హరీశ్‌ రావు సొంత జిల్లా సిద్దిపేటకు తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఆలేరు ప్రాంత ప్రజలపై ప్రేమలేదని విమ‌ర్శించారు.

ఇప్పటికైనా టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తీరు మార్చుకుని రాజాపేట - ఆలేరు ప్రాంతాలకు తపాసుపల్లి నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  దీంతో నీళ్ల విష‌యంలో ఒక్క‌సారిగా ఆందోళ‌న‌లు రేగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ నీళ్ల‌ను ఏపీ దోచేస్తోంద‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేసిన అధికార నేత‌లు.. ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ఇలా ఆరోప‌ణుల ఎదుర్కోవ‌డం - సొంత నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీళ్ల‌ను త‌ర‌లించ‌డంపై విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి కేసీఆర్ అండ్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News