రాజధాని బాండ్లు..ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేది బాబు?

Update: 2018-08-22 14:18 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాజధాని బాండ్ల అమ్మ‌కంపై ఓ వైపు అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌చారం చేసుకుంటుండ‌గా...మ‌రోవైపు ఈ ప్ర‌క్రియ‌పై అనేక అనుమానాలు - రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణానికి అంటూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి కొన్ని సందేహాలు లేవనెత్తుతూ మూడు రోజుల క్రితం ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్  పార్టీ తరఫున తాజాగా మ‌రిన్ని అంశా ల‌ను పేర్కొంటూ అధికార పార్టీ తీరును - ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఆర్‌ డీఏ వివరణ - కుటుంబరావు  మీడియా ఇంటరాక్టివ్‌ ల ద్వారా ప్రభుత్వం ప‌లు వివ‌ర‌ణ‌లు ఇచ్చిన నేప‌థ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ మ‌రోమారు స్పందించారు.

ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు కూడా సీఆర్‌ డీయే వివరణ ఇచ్చిన నేప‌థ్యంలో వైఎస్ ఆర్‌ సీపీ త‌ర‌ఫున బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్రజల తరఫున మేం అడుగుతున్న మౌలిక అంశాలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నందున ఈ క్రింది అంశాలను మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నామ‌ని  బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ తెలిపారు. అస్ప‌ష్ట వివ‌ర‌ణ‌ల‌తో ప్రభుత్వ వివరణల్లో డొల్లతనం బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  రాజధాని బాండ్ల విషయంలో వడ్డీ రేటు 10.5 శాతం కాదు... 10.32 అంటూ సీఆర్‌ డీయే ఇచ్చిన సమాధానం విచిత్రంగా ఉంది. 10.5కు 10.32కు చాలా తేడా ఉన్నదని చెప్పేందుకు ఆ వివరణలో ప్రయత్నించారు. మేం ప్రశ్నిస్తున్నది అసలు 10.32 శాతానికి ఎందుకు ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సి వచ్చిందన్నది. అది కూడా బాండ్ల రూపంలో ఎందుకు సేకరించారన్నది. ఆ బాండ్లకు కూడా ప్రజల నుంచి పిండి ప్రభుత్వాలు కట్టాల్సిన వడ్డీ, అదీ మూడు నెలలకు ఒకసారి చెల్లించటం ద్వారా మొత్తంగా 10.7 శాతం కంటే మించుతుందన్నది వాస్తవమా? కాదా?  అని బుగ్గ‌న ప్ర‌శ్నించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం బాండ్ల రూపంలో సేకరించిన రూ.2000 కోట్లు ఆరో సంవత్సరం నుంచి వెనక్కు ఇవ్వటం ప్రారంభించినా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని బుగ్గ‌న పేర్కొన్నారు. ``అనుమతించిన విధంగా ఒక వేళ 20 శాతం చొప్పున వెనక్కు తీసుకుంటాం అని పెట్టుబడి దార్లు అడిగితే, అసలుగానే సంవత్సరానికి రూ.400 కోట్లు ఇవ్వాల్సిందే కదా? మొత్తం ఎంతమంది పెట్టుబడి పెట్టారో అందరూ కూడా తమ 20 శాతం వెనక్కు ఇవ్వండి అని అడగవచ్చు కదా? ఇది నిజమా కాదా?రూ. 2000 కోట్లకు  రూ.1573 కోట్లు ‘మాత్రమే’ వడ్డీ కడుతున్నాం అన్నారు. రూ.1573 కోట్లు వడ్డీగా చెల్లించటం, అదీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సొమ్మును చెల్లించటం మీకు అంత ఆషామాషీ వ్యవహారంగా ఎలా మారిందన్నది మాకు అర్థం కావటం లేదు. ఇంకోపక్కన, మీరు లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కావాలంటున్నారు. మరి లక్షల కోట్ల రాజధానికి వడ్డీ కూడా లక్షల కోట్లు అవుతుంది కదా? ఇందులో అసలు ఎవరు కట్టాలి? వడ్డీలు ఎవరు కట్టాలి? ఇందులో లాభం పొందేది ఎవరు? మీరు ఈ రోజున, అదీ ఎన్నికలు ఆరు నెలలు కూడా లేవన్న సమయంలో హడావుడిగా  చేస్తున్న ఈ అప్పులకు రెండు మూడు తరాలు అసలూ వడ్డీలూ కట్టాలా? ఇలాంటి వడ్డీలతో ఎన్ని హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టుల్ని - చిన్న - మధ్యతరహా ప్రాజెక్టుల్ని నిర్మించవచ్చో ఎప్పుడన్నా ఆలోచించారా?`` అని బుగ్గ‌న ప్ర‌శ్నించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ బాండ్ల‌కు - అమ‌రావ‌తి బాండ్ల‌కు లింక్ పెట్ట‌డంపై బుగ్గ‌న మండిప‌డ్డారు. ``జీహెచ్ ఎంసీ బాండ్ల విషయంలో రీ పేమెంట్‌ సెక్యూరిటైజ్‌ అయింది కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు వచ్చిందన్నారు. అంటే దీని అర్థం గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు ఇకమీదట పన్నుల రూపంలో కట్టే డబ్బునుంచే, నేరుగా వడ్డీలూ అసలూ కట్టుకోవాలి. అందులో రాష్ట్ర ప్రజల ప్రమేయం ఉండదు.కానీ, రాజధాని పేరిట మీ బాహుబలి సెట్టింగులకు, మీ హంగూ ఆర్భాటాలకూ, మీరు చేసే భారీ అవినీతికీ, కుంభకోణాలకూ ప్రజల్ని పన్నుల రూపంలో డబ్బు కట్టమంటే ఎందుకు కడతారు?`` అంటూ బుగ్గ‌న నిల‌దీశారు.


Tags:    

Similar News