పథకాలకు జగన్ పేరు... బుగ్గన ఎంత కష్టపడ్డారంటే?

Update: 2019-07-12 16:27 GMT
ఏపీలో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ సర్కారు... నేడు తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిన్న సమావేశాలు ప్రారంభం కాగా... శుక్రవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి 2019-20 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సుదీర్ఘ పాదయాత్రలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలు, ప్రకటించిన నవరత్నాల అమలు దిశగా సాగిన ఈ బడ్జెట్ లో బుగ్గన చాలా ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. సాంతం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగిన బడ్జెట్ లో చాలా పథకాలకు దివంగత సీఎం, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును పెట్టిన బుగ్గన... వైసీపీ హయాంలో కీలకంగా మారనున్న అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఉద్దేశించిన విద్యా దీవెనలకు జగన్ పేరు పెట్టారు.

అన్ని పథకాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టిన బుగ్గన... ఈ రెండు పథకాలకు మాత్రం జగన్ పేరు పెట్టడం వెనుక చాలా తతంగమే నడిచిందట. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తన పేరేమిటని తొలుత జగన్ అస్సలు వద్దే వద్దన్నారట. అయితే ఎలాగోలా జగన్ ను ఒప్పించిన బుగ్గన... అమ్మ ఒడికి జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెనకు జగనన్న విద్యా దీవెన పేర్లను ఖరారు చేశారు. అయినా ఈ పేర్ల కోసం బుగ్గన పడిన కష్టం మామూలుగా లేదట. ఓ పక్క సీఎంగా ఉన్న జగన్ ఆ పథకాలకు తన పేరు ఎందుకు? వద్దంటే వద్దు అంటుంటే... బుగ్గన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆ పేర్లకు జగన్ ఒప్పుకునే దాకా విడిచిపెట్టలేదట. ఈ విషయాన్ని వేరే ఎవరో చెప్పలేదు. బుగ్గననే స్వయంగా ఈ విషయాన్ని వివరించారు.

బడ్జెట్ సాంతం పూర్తి అయిన తర్వాత దాని ఆమోదం కోసం జరిగిన కేబినెట్ లో జగన్ వద్ద బుగ్గన ఈ ప్రతిపాదన పెట్టారట. ఈ ప్రతిపాదన విన్నంతనే దాదాపుగా షాక్ కు గురైన జగన్... తన పేరు సంక్షేమ పథకాలకు ఎందుకు? అంటూ జగన్ చాలా లైట్ గా తీసుకున్నారట. అయితే బుగ్గన వింటే కదా... ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టే ఇలాంటి పథకాలకు రూపకల్పన చేసింది మీరే కదా... మీ పేరు ఉంటే తప్పేంటీ అని బుగ్గన వాదించారట. అయినా గానీ జగన్ ఒప్పుకోలేదట. అయితే బుగ్గన కూడా తన ప్రతిపాదనను విరమించుకునేందుకు ససేమిరా అన్నారట. ఈ క్రమంలో బుగ్గన పదే పదే అదే ప్రతిపాదన చేస్తుండటంతో చేసేదేమీ లేక చివరకు జగన్ సరేనన్నారట. బుగ్గన ఈ మేర కష్టపడితే గానీ... ఆ రెండు పథకాలకు జగన్ పేరు రాలేదన్న మాట.
   

Tags:    

Similar News