అమ‌రావ‌తి టు హైద‌రాబాద్‌.. హైస్పీడ్ ట్రైన్‌

Update: 2017-11-08 06:21 GMT
తెలుగోళ్ల‌కు ఒక స్వీట్ న్యూస్‌. రెండు తెలుగు రాష్ట్ర రాజ‌ధానుల్ని అనుసంధానం చేసే హైస్పీడ్ ట్రైన్ ను న‌డ‌పాల‌ని రైల్వేశాఖ తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. బుల్లెట్ ట్రైన్ భారీ ఖ‌ర్చుతో కూడుకున్న‌ది కాబ‌ట్టి దాని స్థానే త‌క్కువ ఖ‌ర్చుతో పూర్తి అయ్యే హైస్పీడ్ ట్రైన్ ఏర్పాటు దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

వాస్త‌వానికి అమ‌రావ‌తి టు హైద‌రాబాద్ మ‌ధ్య బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కొన్ని అత్యుత్సాహ వార్త‌ల్ని అచ్చేశారు. అయితే..అందులో నిజం లేద‌న్న‌ది తాజా స‌మాచారం. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య బుల్లెట్ ట్రైన్ న‌డ‌పాల‌న్న ఆలోచ‌న లేద‌ని.. కేవ‌లం హైస్పీడ్ ట్రైన్ న‌డ‌పాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలంగాణ ఎంపీ బూర న‌ర్స‌య్య ఒక మీడియా సంస్థ‌కు చెప్పిన‌ట్లుగా పేర్కొంది.

ఈ నెల 27-30 మ‌ధ్య‌న హైద‌రాబాద్ మెట్రో రైల్‌ను ప్రారంభించ‌నున్నారు ప్ర‌ధాని మోడీ. ఈ సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునేలా హైస్పీడ్ ట్రైన్ వివ‌రాల్ని వెల్ల‌డిస్తార‌ని చెబుతున్నారు. జాతీయ ర‌హ‌దారి 65కు స‌మాంత‌రంగా ఈ రైలును న‌డిపే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ నేష‌న‌ల్ హైవేను ఎక్స్ ప్రెస్ వేగా నిర్మించి అభివృద్ధి కారిడార్ గా మార్చేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి వేళ‌లోనే హైస్పీడ్ ట్రైన్‌కు అవ‌స‌ర‌మైన ట్రాక్‌ను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. తాజాగా తెర మీద‌కు వ‌చ్చిన హైస్పీడ్ రైలు ప్ర‌తిపాద‌న ప్ర‌కారం తొలుత హైద‌రాబాద్‌.. విజ‌య‌వాడ‌ల మ‌ధ్యన ఉన్న 270 కిలోమీట‌ర్ల దూరాన్ని ముంబ‌యి-ఫుణె ఎక్స్ ప్రెస్ హైవే మాదిరి 8 లేన్లుగా మారుస్తారు. ఈ స‌మ‌యంలోనే రైలు ట్రాక్ ప‌నులు పూర్తి చేస్తారు. ఇదే త‌ర‌హాలో చెన్నై.. బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రాలను క‌లుపుతూ ఇదే త‌ర‌హా కారిడార్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఏమైనా.. రానున్న రోజుల్లో తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునేలా భారీ ప్లాన్ వేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ద‌క్షిణాదిపై క‌న్నేసిన మోడీ.. త‌మిళ‌నాడులో క‌రుణ‌ని.. ఏపీ.. తెలంగాణ ప్ర‌జ‌ల్ని హైస్పీడ్ ట్రైన్ తో  మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టేయ‌బోతున్నారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News